3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 22) జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ పేసర్ హరీస్ రౌఫ్ నిప్పులు చెరిగాడు. 6.2 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో రౌఫ్‌కు ఇది తొలి ఫైఫర్ కావడం విశేషం. రౌఫ్ భీకర స్పెల్‌కు షాహీన్ అఫ్రిది (4-2-9-2), నసీం షా (5-0-12-1), షాదాబ్ ఖాన్ (1-1-0-1) తోడవ్వడంతో పాక్.. ఆఫ్ఘనిస్తాన్‌ను 59 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా ఆ జట్టు ఆఫ్ఘన్‌పై 142 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
పాక్ పేసర్ల ధాటికి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. ఏకంగా నలుగురు ఆటగాళ్లు డకౌట్లయ్యారు. ఓపెనర్ రహానుల్లా గుర్భాజ్ చేసిన 18 పరుగులే ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌గా నిలిచింది. ఒమర్‌జాయ్ 16 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఇమామ్ ఉల్ హాక్ (61), షాదాబ్ ఖాన్ (39), ఇఫ్తికార్ అహ్మద్ (30), మహ్మద్ రిజ్వాన్ (21), నసీం షా (18 నాటౌట్) మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోవడంతో 47.1 ఓవర్లలో 201 పరుగులు చేసి ఆలౌటైంది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-33-3), రషీద్ ఖాన్ (10-0-42-2), మహ్మద్ నబీ (10-0-34-2), రెహ్మత్ షా (1.1-0-6-1), ఫజల్ హక్ ఫారూకీ (8-0-51-1) ధాటికి పాక్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment