ఆసియా కప్-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ పేస్ త్రయం (షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్) చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ (వన్డే ఫార్మాట్) చరిత్రలో 10కి 10 వికెట్లు (ఓ మ్యాచ్‌లో) తీసిన తొలి పేస్ బౌలింగ్ అటాక్‌గా రికార్డుల్లోకెక్కింది. ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పేసర్లే తీయడం ఇదే మొదటిసారి. 39 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. గతంలో ఎన్నడూ పేసర్లే మొత్తం 10 వికెట్లు తీసింది లేదు.
కాగా, నేటి మ్యాచ్‌లో పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది (10-2-35-4), నసీం షా (8.5-0-36-3), హరీస్ రౌఫ్ (9-0-58-3) టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ త్రయం భారత బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. టీమిండియాపై ఈ ముగ్గురు స్పష్టమైన ఆధిపత్యం కనబర్చారు. ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, సిక్స్) ఆదుకోకపోయుంటే భారత పరిస్థితి దారుణంగా ఉండేది.
ఇషాన్, హార్దిక్‌లతో పాటు ఆఖర్లో బుమ్రా కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత్ 266 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసి ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్ ముగిసాక వర్షం మొదలుకావడంతో పాక్ ఇన్నింగ్స్ ప్రారంభంకాలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించాల్సి వస్తే 40 ఓవర్లలో 239 పరుగులు, 30 ఓవర్లలో 203, 20 ఓవర్లకు 155 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఛేదించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment