మీడియా సమావేశంలో చిరాకు తెప్పించే ప్రశ్నలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ ఉంటాడు. గతంలో విరాట్ కోహ్లితో విభేదాలు, మేజర్ ఈవెంట్లలో భారత జట్టు చేతులెత్తేయడం గురించి ప్రశ్నించిన వారితో పాటు.. బయటివాళ్ల మాటలు తమకు పట్టవంటూ విమర్శకులకూ గట్టిగానే బదులిచ్చాడు. తాజాగా మరోసారి హిట్‌మ్యాన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురుకాగా.. మాటల ‘బౌన్సర్’ సంధించాడు.
ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్‌కు అభిమానుల్లో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు దేశాలతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం దాయాదుల పోరు కోసం ఎదురుచూస్తుందనడం అతిశయోక్తి కాదు.
టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే.. పాకిస్తాన్‌కు తమ పేస్ దళమే ప్రధాన బలం. కాబట్టి ఎప్పటిలాగే ఈసారి కూడా భారత బ్యాటింగ్- పాక్ బౌలింగ్ మధ్య హోరాహోరీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా శనివారం ఈ హైపర్ టెన్షన్ మ్యాచ్ జరుగనుంది.
ఈ నేపథ్యంలో భారత జట్టు సారథి రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాక్ పేస్ త్రయాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నెట్స్‌లో షాహిన్ ఆఫ్రిది, నసీం షా లేదంటే హ్యారిస్ రవూఫ్.. వీరిలో ఎవరూ కూడా మాకు బౌలింగ్ చేయలేదు కదా!
మా బౌలర్లతోనే మేము ప్రాక్టీస్ చేస్తాం. మా దగ్గర నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. రేపటి మ్యాచ్‌లో కేవలం మా అనుభవమే అక్కరకు వస్తుంది’’ అని రోహిత్ కౌంటర్ ఇచ్చాడు. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రాక తమకు సానుకూలాంశంగా మారిందన్న హిట్‌మ్యాన్.. ‘‘ప్రస్తుతం మా జట్టులో ఆరుగురు గొప్ప బౌలర్లు అందుబాటులో ఉన్నారు.
ఐర్లాండ్ పర్యటనతో పునరాగమనం చేసిన బుమ్రా పూర్తి ఫిట్‌గా కనిపిస్తున్నాడు. బెంగళూరు ట్రెయినింగ్ క్యాంపులోనూ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ముగ్గురు పేసర్లూ ఫిట్‌గా ఉండటం కలిసి వస్తుంది. మాకు ఇది గొప్ప సానుకూల అంశం’’ అని చెప్పుకొచ్చాడు. బుమ్రాతో పాటు షమీ, సిరాజ్‌లు కూడా రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment