సొంతగడ్డపై పాకిస్తాన్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో స్వల్ప తేడాతో బాబర్ ఆజం బృందం ఓడిపోయింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 2-1తో పాక్‌పై పైచేయి సాధించింది.
కాగా బాబర్ ఆజం కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్ తొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఇందులో తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో పాక్ గెలిచింది.
అయితే, మరుసటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన కివీస్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్(36 బంతుల్లో 51), టామ్ బ్లండెల్ (15 బంతుల్లో 28), వన్‌డౌన్ బ్యాటర్ ఫాక్స్‌క్రాఫ్ట్(26 బంతుల్లో 34), కెప్టెన్ మిచెల్ బ్రాస్‌వెల్(20 బంతుల్లో 27) రాణించారు.
పాక్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. ఆమిర్, ఉసామా మిర్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ ఆమిర్, జమాన్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఇక లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే సయీమ్ ఆయుబ్(20), బాబర్ ఆజం(5), ఉస్మాన్ ఖాన్(16) వికెట్లు కోల్పోయింది. అయితే, ఫఖర్ జమాన్ పట్టుదలగా నిలబడి 45 బంతుల్లో 61 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
ఇఫ్తికర్ అహ్మద్(20 బంతుల్లో 23), ఇమాద్ వసీం(11 బంతుల్లో 22 నాటౌట్) పోరాడాడు. కానీ ఆఖరి బంతికి పాక్ విజయానికి ఆరు పరుగులు అవసరం కాగా.. క్రీజులో ఉన్న ఇమాద్ వసీం జెమ్మీ నీషం బౌలింగ్‌లో ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు. ఫలితంగా నాలుగు పరుగుల తేడాతో పాక్ ఓటమిపాలైంది.
దీంతో లాహోర్ ప్రేక్షకుల హృదయాలు ముక్కలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీసి కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన 22 ఏళ్ల పేసర్ విలియం రూర్కీకి ప్లేయర్‌ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment