పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఆ జట్టు స్టార్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. పాక్ క్రికెట్ బోర్డు అవకాశం ఇస్తే మరోసారి దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. ఈ ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. రిటైర్మెంట్ వెనక్కు తీసుకుంటున్న విషయాన్ని ఆమిర్ ఆదివారం వెల్లడించాడు.
పాక్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరిపిన అనంతరం రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆమిర్ పేర్కొన్నాడు. మరోసారి పాక్ జట్టుకు ఎంపిక చేసే విషయంలో పీసీబీ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపాడు. పాక్ జట్టుకు ఆడటం తన కల అని.. పాక్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఏ వయసులో వచ్చినా వదులుకోనని అన్నాడు. 31 ఏళ్ల ఆమిర్ 2020లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
అప్పటి నుంచి లీగ్ క్రికెట్‌కు మాత్రమే పరిమితమైన ఆమిర్.. తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు. 17 ఏళ్ల వయసులోనే పాక్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న ఆమిర్.. ఆ జట్టు తరఫున 36 టెస్ట్‌లు, 61 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతను 259 వికెట్లు పడగొట్టాడు. ఆమిర్ వన్డేల్లో రెండు అర్దసెంచరీలు కూడా చేశాడు.
ఇటీవల ఆమిర్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2024 పీఎస్‌ఎల్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఆమిర్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి ముందు మరో పాక్ క్రికెటర్ కూడా రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకున్నాడు. ఆ జట్టు స్టార్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం టీ20 వరల్డ్‌కప్‌లో అవకాశం కోసం రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment