రెండో టెస్టుకు పంత్, గిల్ రెడీ
టీమిండియా అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే వెల్లడి
పుణే: గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన శుబ్‌మన్ గిల్‌తో పాటు... మోకాలి వాపుతో కీపింగ్ చేసేందుకు ఇబ్బంది పడిన రిషబ్ పంత్ రెండో టెస్టు వరకు అందుబాటులో ఉంటారని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే వెల్లడించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా... భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం నుంచి పుణేలో రెండో టెస్టు ప్రారంభం కానుండగా.. మంగళవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. అనంతరం డస్కటే మీడియాతో మాట్లాడాడు.
బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాన్వేను స్టంపౌట్ చేసే ప్రయత్నంలో పంత్ మోకాలికి గాయమైంది. గతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అదే కాలికి శస్త్రచికిత్స జరగడంతో జట్టు మొత్తం ఆందోళనకు గురైంది. గాయం తీవ్రత ఎక్కువ ఉండటంతో వెంటనే పంత్ మైదానాన్ని వీడగా... అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. అనంతరం అత్యవసర పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్... పరిగెత్తడానికి ఇబ్బంది పడుతూనే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే మ్యాచ్ అనంతరం ‘పంత్‌ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొనడంతో అతడు రెండో టెస్టులో ఆడతాడా లేదా అనే సంశయం నెలకొంది. అయితే తాజాగా డస్కటే ఈ అంశంపై స్పష్టత ఇచ్చాడు. ‘పంత్ పూర్తిగా కోలుకున్నాడు. పుణే టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడు. గిల్ ఆరోగ్యం కూడా కుదుట పడింది. అతడు నెట్ ప్రాక్టీస్ కూడా చేశాడు. మ్యాచ్ వరకు అంతా సవ్యంగా ఉంటుంది అనుకుంటున్నాం’ అని డస్కటే పేర్కొన్నాడు.
ఆ ఇద్దరి మధ్యే పోటీ
భారత తుది జట్టులో చోటు కోసం ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ ఉందని డస్కటే అన్నాడు. తొలి టెస్టులో భారీ సెంచరీతో రాణించిన సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ మధ్య పోటీ ఉందని అన్నాడు. ‘ఇందులో దాయడానికి ఏమీ లేదు. తుది జట్టులో ఓ బెర్త్ కోసం పోటీ ఉంది. బెంగళూరు టెస్టులో సర్ఫరాజ్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ కూడా సంసిద్ధంగా ఉన్నాడు. పిచ్, పరిస్థితులను బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది.
రాహుల్ ఆటతీరును కోచ్ గౌతమ్ గంభీర్ నిశితంగా పరిశీలిస్తున్నాడు. రాహుల్‌పై టీమ్ మేనేజ్‌మెంట్‌కు నమ్మకముంది. అదే సమయంలో దేశవాళీలతో పాటు అవకాశం వచ్చిన ప్రతిసారీ జాతీయ జట్టు తరఫున నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సర్ఫరాజ్‌ను కూడా పక్కన పెట్టలేం. అందుకే అందరు ఆటగాళ్లకు అండగా నిలుస్తాం. న్యూజిలాండ్ జట్టులో ఎక్కువ మంది ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉండటం వల్లే ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టుకు ఎంపిక చేశారు. ఇటీవల రంజీ ట్రోఫీలో అతడి ప్రదర్శన బాగుంది.
తమిళనాడు తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి భారీ సెంచరీ బాదడంతో పాటు... బౌలింగ్‌లోనూ రాణించాడు’ అని డస్కటే గుర్తు చేశాడు. ఇక స్వదేశంలో జరిగిన టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ను కూడా డస్కటే వెనకేసుకొచ్చాడు. ‘బెంగళూరు టెస్టు ఆఖరి రోజు తొలి గంటలో సిరాజ్ చక్కటి బౌలింగ్ చేశాడు. దురదృష్టవశాత్తు వికెట్ దక్కక పోయినా... అతడి బౌలింగ్‌లో ఎలాంటి లోపం లేదు.
నాణ్యమైన బంతులతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. పుణేలో పరిస్థితులను బట్టే జట్టు ఎంపిక ఉంటుంది’ అని డస్కటే వివరించాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఎలాంటి సమస్యలు లేవని అతడు అన్నాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టే అతడు తక్కువ బౌలింగ్ చేశాడని తెలిపాడు.
టీమిండియా ముమ్మర సాధన
తొలి టెస్టులో పరాజయం పాలై సిరీస్‌లో వెనుకబడిన టీమిండియా... రెండో టెస్టు కోసం కసరత్తులు చేస్తోంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు. పంత్ గాయం నేపథ్యంలో మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్... కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. కాసేపటికి మైదానంలోకి వచ్చిన పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో పాటు చివర్లో కీపింగ్ సాధన కూడా చేయడంతో అతడి ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి.
మరోవైపు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఇక కొత్తగా జట్టుతో కలిసి వాషింగ్టన్ సుందర్ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ సాగించాడు. ఈ మ్యాచ్ కోసం రూపొందించిన పిచ్‌ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెపె్టన్ రోహిత్ శర్మ, బౌలర్లు జడేజా తదితరులు నిశితంగా పరిశీలించారు. రెండో టెస్టు కోసం స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను తయారు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment