అట్టహాసంగా ఒలింపిక్స్ క్రీడోత్సవం
ఫ్రెంచ్ పరిమళం గుబాళింపు
సెన్ నదీ తీరం వెంట సాగిన వేడుకలు
ఆతిథ్య దేశపు ఘనతల ప్రదర్శన
ఈఫిల్ టవర్ సమీపాన చారిత్రక ‘ట్రొకార్డో’ వద్ద ప్రారంభమైన పరేడ్ సెన్ నదీ తీరం వెంట సాగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్‌తో పాటు దాదాపు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రారంబోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అన్నింటికంటే ముందు సెన్ నదిపై ఉన్న పాంట్ డి ఆస్టర్‌లిజ్ బ్రిడ్జిపై ఫ్రాన్స్ జాతీయ పతాకంలోని ఎరుపు, తెలుపు, నీలి రంగులను వెదజల్లుతూ నయనానందకరంగా కార్యక్రమం మొదలైంది.
మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఫ్రెంచ్ భాషలో ‘ఎన్‌చాంట్’ నినాదంతో పడవలపై ఆటగాళ్ల పరేడ్ మొదలైంది. ఎప్పటిలాగే తొలి ఒలింపిక్స్‌కు వేదికైన గ్రీస్ బృందం అందరికంటే ముందుగా రాగా, ఐఓసీ శరణార్థి టీమ్ దానిని అనుసరించింది. ఫ్రెంచ్ అక్షరమాలలో జట్లు వరుసగా వచ్చాయి. బోట్‌లు వెళుతున్న సమయంలో ఫ్రెంచ్ సంగీతాన్ని నేపథ్యంలో వినిపించారు. అనంతరం ప్రఖ్యాత పాప్ సింగ్ లేడీ గాగా తన ఆటపాటతో అలరించింది.
పారిస్: ప్రారంబోత్సవంలో భాగంగా ఆ తర్వాత ఫ్రాన్స్ దేశపు చరిత్ర, సంస్కృతి, సంగీతం అన్నీ ప్రతిబింబించేలా వరుసగా కార్యక్రమాలు సాగాయి. 80 మంది కళాకారులతో ఫ్రెంచ్ క్యాబరే డ్యాన్స్ ‘కెన్ కెన్’ను ప్రదర్శించగా... పారిస్ ఒలింపిక్ క్రీడలను నిర్వహించడంలో పని చేసిన కార్మికులు, సామాన్య ప్రజలకు అంకితం ఇస్తూ ‘సింక్రానిసిటీ’ పేరుతో షోను ఫ్రాన్స్ పర్యాటక ప్రదేశాల్లో ప్రఖ్యాతమైన ‘నోటర్ డేమ్ క్యాథడ్రిల్’ వద్ద నిర్వహించారు.
ఆపై ఫ్రెంచ్ సాహిత్యం విశేషాలు తెలిపే, ఆ దేశపు ప్రస్థానాన్ని తెలిపే థీమ్‌తో ప్రోగ్రాం జరిగింది. ఈ క్రమంలో ఫ్రెంచ్ విప్లవ కాలపు గీతాలను కూడా వినిపించారు. చారిత్రక ల్యూర్ మ్యాజియం, మేడలీన్ చిత్రం తదితర కళాఖండాలను గుర్తుకు తెస్తూ వాటిని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఆ తర్వాత ఫ్రెంచ్ సినిమాకు నీరాజనం అంటూ కార్యక్రమం సాగింది. అనంతరం ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని వినిపించారు. ఈ సమయంలో ఫ్రెంచ్ చరిత్రలో పది మంది ప్రముఖ మహిళల బంగారు విగ్రహాలను ప్రదర్శించారు.
78 మందితో మన బృందం...
బోట్‌లపై పరేడ్‌లో 84వ స్థానంలో భారత జట్టు వచ్చింది. ఫ్లాగ్ బేరర్లు పీవీ సింధు, ఆచంట శరత్ కమల్ ముందుండి భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించగా... ఇతర అథ్లెట్లు కూడా చేతుల్లో చిన్న పతాకాలతో అభివందనం చేశారు. ఒలింపిక్స్‌లాంటి విశ్వ సంబరంలో పాల్గొంటున్న ఆనందం అందరిలోనూ కనిపించింది. దీపిక కుమారి, లవ్లీనా బొర్గొహైన్, మనికా బత్రా, రోహన్ బోపన్న, సుమీత్ నగాల్, శ్రీరామ్ బాలాజీ తదితరులు పరేడ్‌లో భాగమయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో భారత్ నుంచి ఆటగాళ్లు, అధికారులు కలిపి మొత్తం 78 మంది పాల్గొన్నారు.
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, పారిస్ ఒలింపిక్స్‌లో భారత చెఫ్ డి మిషన్ గగన్ నారంగ్ కలిసి ఈ బృందాన్ని ఎంపిక చేశారు. శనివారం పోటీలో పాల్గొనే ప్లేయర్లతో పాటు ఇంకా పారిస్‌కు చేరుకోని అథ్లెట్లు, వెయిట్‌లిఫ్టర్లు, రెజ్లర్లు ఈ కార్యక్రమంలో భాగం కాలేదు. శనివారం తమ పోటీలు లేని షూటర్లు అంజుమ్, సిఫ్ట్ కౌర్, ఐశ్వర్య ప్రతాప్, అనీశ్ కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. భారత హాకీ జట్టు నేడు న్యూజిలాండ్‌తో తలపడనుండటంతో జట్టులోని రిజర్వ్ ఆటగాళ్లు మాత్రమే హాజరయ్యారు.
‘తస్వ’ డిజైన్లతో...
ప్రారంబోత్సవ కార్యక్రమంలో భారత బృందం ధరించిన డ్రెస్‌లను ప్రముఖ కంపెనీ ‘తస్వ’ తయారు చేసింది. పురుషుల డ్రెస్‌లలో, మహిళల చీరకట్టులో కూడా అంచులను భారత త్రివర్ణ పతాకపు మూడు రంగులతో డిజైన్ చేశారు. ‘తస్వ’ కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందినది కాగా... ఇందులో భాగంగా ఉన్న ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని పర్యవేక్షణలోనే భారత టీమ్ డ్రెస్ రూపకల్పన జరిగింది. మరో వైపు మన ఆటగాళ్లు పోటీల్లో పాల్గొనే సమయంలో ఉపయోగించే కిట్‌లను ప్రముఖ సంస్థ జిందాల్ గ్రూప్‌నకు చెందిన ‘ఇన్‌సై్పర్’ రూపొందించింది.
జిందాల్ గ్రూప్ గతంలో 2022 కామన్వెల్త్ క్రీడల్లో, 2023 ఆసియా క్రీడల్లో కూడా భారత బృందానికి కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు వాడే స్పోర్ట్స్ కిట్‌లను డిజైనర్ ఆఖిబ్ వాని రూపొందించాడు. నీరజ్ చోప్రా, మనూ భాకర్, మనికా బాత్రా తదితర ఆటగాళ్లు జిందాల్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌లో భాగంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment