10,500 మంది... ఒకటే స్వప్నం!.. నేటి నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌ | Paris Olympics from today | Sakshi
Sakshi News home page

10,500 మంది... ఒకటే స్వప్నం!.. నేటి నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌

Published Fri, Jul 26 2024 4:17 AM | Last Updated on Fri, Jul 26 2024 6:59 PM

Paris Olympics from today

ఆగస్టు 11 వరకు పోటీలు 

32 క్రీడాంశాల్లో 329 మెడల్‌ ఈవెంట్లు 

భారత్‌ నుంచి 16 క్రీడాంశాల్లో 117 మంది బరిలోకి

నేటి రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమం 

స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలలో ప్రత్యక్ష ప్రసారం

పతకం... పతాకం... ఒక అథ్లెట్‌కు వీటితో విడదీయరాని బంధం... పతకం గెలిచిన వేళ జాతీయ పతాకం ఎగురుతుంటే సగర్వంగా నిలబడి ఆ అనుభూతిని పొందగలగడం ఒక్క క్రీడాకారుడికి మాత్రమే సాధ్యం... అదీ ఒలింపిక్స్‌లాంటి అత్యంత ప్రతిష్టాత్మక వేదికపై అంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు... ఆ భావోద్వేగ క్షణం కోసమే సంవత్సరాల శ్రమ, పోరాటం, పట్టుదల... ప్రణాళికలు, వ్యూహాలు, సన్నాహాలు, శిక్షణ... డైట్, ఫిట్‌నెస్, మెంటల్‌ స్ట్రెంత్‌... అన్నీ అన్నీ కలగలిస్తే ఒలింపిక్స్‌ పతకం... ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల కల ఒలింపిక్స్‌లో మెడల్‌ గెలుచుకోవడమే... ఎన్ని చాంపియన్‌షిప్‌లు సాధించినా, ఎన్ని ట్రోఫీలు గెలుచుకున్నా, ఒలింపిక్‌ పతకం మాత్రమే అథ్లెట్‌ను ఆకాశాన నిలబెడుతుంది. 

ఆ కంఠాభరణం మెరుపుల ముందు ఎన్ని ఆభరణాలైనా తక్కువే. స్వర్ణం, రజతం, కాంస్యం... పేర్లు వేరు కావచ్చు... కానీ వీటిలో ఏ పతకం సాధించినా ఆయా అథ్లెట్లకు అది బంగారంతో సమానమే. ఒక్క ఒలింపిక్‌ పతకంతోనే చరిత్రను సృష్టించినవారు కొందరైతే ... మళ్లీ మళ్లీ గెలుస్తూ వాటిని అలవాటుగా మార్చుకున్న దిగ్గజాలు కూడా ఎందరో... ఇప్పుడు మరోసారి ఆ విశ్వ సమరానికి సమయం వచ్చేసింది. పతకం వేటలో సర్వం ఒడ్డేందుకు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. 

వందేళ్ల తర్వాత ‘ఫ్యాషన్‌ సిటీ’ పారిస్‌ మరోసారి మెగా ఈవెంట్‌ కోసం ముస్తాబైంది. ఇన్నేళ్ల ఒలింపిక్స్‌లలో ఎన్నడూ చూడని పలు విశేషాలతో ఈ సంబరాన్ని జయప్రదం చేసేందుకు నిర్వాహకులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ప్రారం¿ోత్సవ కార్యక్రమం మొదలు విజేతలకు అందించే పతకాల్లో చరిత్రను చేర్చడం వరకు అన్నింటా తమ ప్రత్యేకత కనిపించేలా సిద్ధం చేశారు. 124 ఏళ్ల క్రితం పారిస్‌ ఒలింపిక్స్‌లోనే తొలిసారి మహిళలు అడుగు పెట్టగా... ఇప్పుడు అదే గడ్డపై జరుగుతున్న పోటీల్లో తొలిసారి పురుషులు, మహిళలు సమాన సంఖ్యలో బరిలోకి దిగుతుండటం విశేషం. 

ఇంట్లో శుభకార్యాన్ని పర్యవేక్షించే పెద్ద మనిషి తరహాలో దాదాపు వేయి అడుగుల ఎత్తులో ఠీవిగా నిలబడిన ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా రెండు వారాల పాటు ఒలింపిక్‌ వేడుకలు అంబరాన్నంటనున్నాయి. మూడేళ్ల క్రితం చుట్టూ కోవిడ్‌ ముసురుకున్న సమయంలో సాగిన టోక్యో ఒలింపిక్స్‌ అభిమానులకు అర్ధ ఆనందాన్ని మాత్రమే అందించాయి. ఇప్పుడు జరిగే పోటీలు గత గేమ్స్‌కు భిన్నంగా ఫ్యాన్స్‌కు చేరువగా వచ్చి సంబరంలో భాగం చేయనున్నాయి. హోరాహోరీ సమరాల్లో 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు 32 క్రీడాంశాల్లో పోటీ పడిన తర్వాత ఎవరు పతకధారిగా శిఖరాన నిలుస్తారో, ఎవరు గుండె పగిలి కన్నీళ్లతో తిరిగొస్తారో చూడాలి!    –సాక్షి క్రీడా విభాగం

తొలిసారి స్టేడియం బయట...
ఒలింపిక్స్‌ ప్రారంబోత్సవ వేడుకలను ప్రధాన స్టేడియం లోపల పరిమిత ప్రేక్షకుల మధ్య నిర్వహించడం రివాజు. ఇన్నేళ్ల చరిత్రలో ఇది ఎప్పుడూ మారలేదు. కానీ ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులు ఈ వేడుకలను స్టేడియం బయటకు తీసుకొస్తున్నారు. నగరం నడి మధ్యలో సెన్‌ నది పక్కన పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజల సమక్షంలో ఈ వేడుకలు జరగనున్నాయి. 

సాధ్యమైనంత ఎక్కువ మంది దీనికి హాజరయ్యేలా సాధారణ పౌరులందరినీ అనుమతిస్తున్నారు. పారిస్‌ నగరవాసులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి చెందినవారైనా సరే ఈ వేడుకల్లో పాల్గొనవచ్చు. ఎనభై భారీ స్క్రీన్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒలింపిక్‌ క్రీడల చరిత్రలోనే వీటిని అతి పెద్ద వేడుకలుగా చెప్పవచ్చు. దాదాపు వంద బోట్‌లలో వివిధ దేశాల క్రీడాకారులు సెన్‌ నదిపై బోటులో ప్రయాణిస్తూ పరేడ్‌లో పాల్గొంటారు. 

10,500 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొననుండటం విశేషం. ఆరు కిలోమీటర్ల పొడవున సాగే ఈ పరేడ్‌ పారిస్‌ నగరం నడిమధ్యలోంచి వెళ్లి చివరకు ట్రొకాడెరో వద్ద ముగుస్తుంది. ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉండటంతో పాటు అందమైన గార్డెన్‌లు, ఫౌంటేన్‌లకు ప్రసిద్ధి. గతంలో ఎన్నడూ లేని విధంగా అథ్లెట్లందరినీ ప్రారం¿ోత్సవ వేడుకల్లో వేదికపైకి ఆహ్వావనించి పరిచయం చేయబోతున్నారు.  

భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల నుంచి వేడుకలు మొదలవుతాయి. ప్రారంబోత్సవంలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఎవరెవరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను మాత్రం నిర్వాహకులు గోప్యంగానే ఉంచారు. అసలు రోజు మాత్రమే దానిని ‘సర్‌ప్రైజ్‌’గా చూపించాలని వారు భావిస్తున్నారు. ఎప్పటిలాగే పరేడ్‌లో అందరికంటే ముందు గ్రీస్‌ దేశపు ఆటగాళ్లు రానుండగా... ఆ తర్వాత శరణార్ధి జట్టు గ్రీస్‌ను అనుసరిస్తుంది. 

ఆ తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో ఆయా దేశాలు పాల్గొంటాయి. నిర్వాహక దేశం ఫ్రాన్స్‌ ఈ పరేడ్‌లో చివరగా వస్తుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా తమ దేశం తరఫున కాకుండా వ్యక్తిగత హోదాలో పోటీల బరిలోకి దిగుతున్న రష్యా, బెలారస్‌ ఆటగాళ్లు ఎవరూ పరేడ్‌లో పాల్గొనరు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ మొత్తం ఈవెంట్‌ సాగే అవకాశం ఉంది.  

» ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి పురుషులు, మహిళలు సమాన సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు. ఈ పోటీల్లో 5,250 మంది పురుషులు, 5,250 మంది మహిళలు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.  
» ఒలింపిక్స్‌లో తొలిసారి ఆరి్టస్టిక్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో పురుషులు కూడా పోటీ పడనున్నారు.  
» లండన్‌ (1908, 1948, 2012) తర్వాత మూడుసార్లు ఒలింపిక్స్‌ నిర్వహిస్తున్న రెండో నగరంగా పారిస్‌ (1900, 1924, 2024) గుర్తింపు పొందింది. 1924 జూలై 27న పారిస్‌లో ముగింపు ఉత్సవం జరగా... ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత జూలై 26న ప్రారంబోత్సవ కార్యక్రమం జరుగుతోంది.  
» మొత్తం క్రీడాంశాలు 32... పతకం గెలుచుకునే అవకాశం ఉన్న ఈవెంట్‌లు 329. 
» అత్యధికంగా అక్వాటిక్స్‌లో 49 మెడల్స్‌ అందుబాటులో ఉండగా... అథ్లెటిక్స్‌లో 48 మెడల్‌ ఈవెంట్లు ఉన్నాయి.  
» పారిస్‌ నగరం, దాని శివార్లలో కలిపి మొత్తం 35 వేదికల్లో పోటీలు జరుగుతాయి. బీచ్‌ వాలీబాల్‌ పోటీలను ఈఫిల్‌ టవర్‌ పక్కనే నిర్వహిస్తుండటం విశేషం.  
» ఒలింపిక్స్‌ ఈవెంట్‌లలో ఒకటైన సర్ఫింగ్ ను ‘తహితి’ దీవుల్లో నిర్వహిస్తున్నారు. ఫ్రాన్స్‌కు దాదాపు 15 వేల కిలో మీటర్ల దూరంలో పసిఫిక్‌ మహా సముద్రం మధ్యలో ఈ దీవి ఉంది. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌లకు ఇది దగ్గరగా ఉంటుంది. అయితే ఇది ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న దీవి కావడంతో ఒలింపిక్స్‌ వేదికల్లో ఒకదానిని దీనిని కూడా ఎంపిక చేయడం విశేషం.  
» క్రీడా గ్రామంలో మొత్తం 14,250 మంది కోసం గదులు సిద్ధం చేశారు. ప్రతీ రోజూ కనీసం 60 వేల భోజనాలు అందిస్తారు. క్రీడల తర్వాత దీనిని ఒక బస్తీగా మారుస్తున్నారు. నిర్వహణలో సహాయకారిగా ఉండేందుకు 40 వేల మంది వలంటీర్లు ఈ గేమ్స్‌లో అందుబాటులో ఉన్నారు.   

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement