వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను శనివారం వెల్లడించింది. ఇటీవల సౌతాఫ్రికాలో పర్యటించిన టెస్టు జట్టులో ఏకంగా ఏడు మార్పులు చేసి.. ట్విస్ట్ ఇచ్చింది. ఇమామ్-ఉల్- హక్(Imam-ul-Haq) రీఎంట్రీతో పాటు మరెన్నో ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంది.
అబ్దుల్లా షఫీక్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. ఇమామ్‌కు పిలుపునిచ్చారు. కాగా ఇమామ్ ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 635 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ సెంచరీలు(184, 160) ఉన్నాయి. దీంతో సూపర్ ఫామ్‌లో ఉన్న ఇమామ్ ఉల్ హక్‌కు సెలక్టర్లు పిలుపునివ్వడం గమనార్హం.
విండీస్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరం
ఇదిలా ఉంటే.. మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్(Abrar Ahmed) కూడా తిరిగి రాగా.. షాహిన్ ఆఫ్రి(Shaheen Afridi)ది మాత్రం ఈ జట్టులో లేడు. పని భారాన్ని తగ్గించే క్రమంలో మేనేజ్‌మెంట్ అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.
అదే విధంగా.. నసీం షా, ఆమిర్ జమాల్, మీర్ హంజాలను కూడా సెలక్టర్లు రెస్ట్ పేరిట పక్కనపెట్టినట్లు సమాచారం. ఇక ఫామ్‌లో ఉన్న సయీమ్ ఆయుబ్ సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతడు విండీస్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు చోటు
ఈ నేపథ్యంలో ఖుర్రం షాజాద్‌తో పాటు మహ్మద్ అలీ, అన్‌క్యాప్డ్ ప్లేయర్ కశిఫ్ అలీ పేస్‌దళ విభాగంలో చోటు దక్కించుకున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో తమ చివరి సిరీస్‌లో పాకిస్తాన్ సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడుతోంది. ముల్తాన్ వేదికగా జనవరి 17-21 మధ్య తొలి టెస్టు, జనవరి 25-29 మధ్య రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
అనంతరం న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో స్వదేశంలో పాకిస్తాన్ త్రైపాక్షిక వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే.. ప్రధాన పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షాలకు టెస్టు జట్టు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సౌతాఫ్రికాలో పరాభవం
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సెంచూరియన్, కేప్‌టౌన్ టెస్టుల్లో ఓడి 2-0తో క్వీన్‌స్వీప్‌నకు గురైంది. అంతకు ముందు టీ20 సిరీస్‌ను ప్రొటిస్ జట్టుకు చేజార్చుకున్న పాక్.. వన్డే సిరీస్‌ను మాత్రం 3-0తో వైట్‌వాష్ చేసింది. తద్వారా సౌతాఫ్రికా జట్టును తమ సొంతగడ్డపై వన్డేల్లో ఈ మేర క్లీన్‌స్వీప్ చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులామ్, కాశిఫ్ అలీ, ఖుర్రం షాజాద్, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్ బ్యాటర్), నొమన్ అలీ, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్ బ్యాటర్), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా.
Comments
Please login to add a commentAdd a comment