Ravindra Jadeja Responds to Kapil Dev's Money Making Players Arrogant Remark: టీమిండియాను ఉద్దేశించి దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గట్టి కౌంటర్ ఇచ్చాడు. కష్టపడితేనే జట్టులో చోటు దక్కుతుందని.. అంతేతప్ప తేరగా ఎవరూ తమకు అవకాశాలు వస్తున్నాయని భావించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రతి ఒక్క ఆటగాడు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని పేర్కొన్నాడు.
డబ్బు వల్ల అహంకారం పెరిగింది!
కాగా ప్రస్తుతం జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లు.. దేశం కోసం ఆడటం కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కపిల్ దేవ్ విమర్శించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆటగాళ్లలో అహంకారం పెరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదేనన్న కపిల్.. అయితే, అన్నీ తమకే తెలుసనన్న భావన పనికిరాదని చురకలు అంటించాడు.
మాకేమీ ఊరికే అవకాశాలు రావు!
ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు.. ఎవరి సలహాలు, సూచనలు తీసుకోవడానికి కూడా ఇష్టపడరంటూ ‘ది వీక్’తో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో మూడో వన్డే ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రవీంద్ర జడేజా ముందు విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు బదులుగా.. ‘‘ఆయన ఎప్పుడు ఈ మాటలు అన్నారో నాకు తెలియదు.
జట్టు ఓడిపోయినప్పుడల్లా..
నేను సోషల్ మీడియాలో ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేయను. అయినా, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయం అనేది ఉంటుంది. ఆయన విషయంలోనూ అంతే! ప్రతీ ఆటగాడు ఆటను పూర్తిగా ఆస్వాదిస్తూ.. జట్టులో స్థానం కాపాడుకోవడానికి శ్రమిస్తూనే ఉంటాడు. టీమ్‌లో చోటు ఆయాచితంగా వచ్చిందన్నట్లు ప్రవర్తించరు.
ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారి కచ్చితంగా 100 శాతం ఎఫర్ట్ పెట్టి టీమిండియాను గెలిపించడానికే కృషి చేస్తారు. అయితే, ఎప్పుడైతే జట్టు ఓడిపోతుందో అలాంటపుడు.. ఇలాంటి మాటలు వినిపించడం సహజం. ప్రస్తుతం జట్టు ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండి ఉంది. ఎవరికీ ఎలాంటి అహంకారం, అహంభావం లేదు.
దేశం కోసమే ఆడుతున్నాం.. అంతేగానీ..
ప్రతి ఒక్కరు భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వాళ్లే. మేమంతా దేశం కోసమే ఆడుతున్నాం. మాకు వ్యక్తిగత ఎజెండాలంటూ ఏమీ ఉండవు’’ అంటూ జడ్డూ.. కపిల్ దేవ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఓటమిపాలైంది.
ఇరు జట్ల మధ్య మంగళవారం(ఆగష్టు 1) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా మీడియాతో ముచ్చటించాడు. ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.
చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment