అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో గులాబీ బంతితో స్టార్క్ మాయ చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే జైశ్వాల్ ఔట్ చేసిన స్టార్క్.. ఆ తర్వాత ఆఖరి వికెట్ వరకు తన జోరును కొనసాగించాడు.
మొత్తంగా 6 వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బతీశాడు. అతడి బౌలింగ్ ధాటికి భారత్ కేవలం 180 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో మిచెల్ స్టార్క్‌పై ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. స్టార్క్‌ను 'పింక్ బాల్ మాంత్రికుడు' అని అతడు కొనియాడాడు.
"స్టార్క్ కుడి చేతి వాటం బ్యాటర్లకు అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అతడు తన సీమ్ డెలివరీలతో రైట్ హ్యాండ్ బ్యాటర్లను బెంబెలెత్తించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. పింక్ బాల్‌తో 40వ ఓవర్‌లో కూడా స్వింగ్ చేయడం ఇప్పటివరకు నేను చూడలేదు. కానీ అది స్టార్క్‌కే సాధ్యమైంది.
బంతి పాతపడినప్పటకి అద్భుతంగా స్వింగ్ చేసాడు. అతడు ఈ మూమెంట్ కోసమే ఎదురుచూస్తున్నాడు. తనకు లభించిన ఆరంభాన్ని అందిపుచ్చుకున్నాడు. జీవితంలోనైనా ఆటలోనైనా కమ్‌బ్యాక్ ఇవ్వడం అంత సులువు కాదు. తిరిగి రావడానికి కొన్ని అవకాశాలు మనకు లభిస్తాయి.
వాటిని అందుపుచ్చుకుంటే ముందుకు వెళ్లగలము. స్టార్క్ అదే చేసి చూపించాడు. తొలి టెస్టులో భారీగా పరుగులిచ్చినప్పటికి అడిలైడ్‌లో సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఫ్లడ్ లైట్ల వెలుగులో బంతితో మాయ చేశాడు. అతడు పింక్ బాల్ మాంత్రికుడులా కన్పించాడని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేడెన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment