PSL 2023: 515 Runs Scored Between Multan Sultans Vs Quetta Gladiators, Breaks Records - Sakshi
Sakshi News home page

PSL MS Vs QTG: టీ20 మ్యాచ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు.. ఏకంగా! రిజ్వాన్‌ బృందం చరిత్ర..

Published Sun, Mar 12 2023 8:39 AM | Last Updated on Sun, Mar 12 2023 1:01 PM

PSL 2023 Multan Sultans Vs Quetta Gladiators 515 Runs Breaks Records - Sakshi

పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌లో టీ20 ఫార్మాట్లో ప్రపంచ రికార్డు (PC: PSL)

Quetta Gladiators vs Multan SultansWorld Record: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. పెషావర్‌ జల్మీతో మ్యాచ్‌లో 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముల్తాన్‌ జట్టు.. శనివారం నాటి మ్యాచ్‌లో మరో రికార్డు విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ చేరిన రిజ్వాన్‌ బృందం.. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఇంటికి పంపింది. 

వివరాలు.. రావల్పిండిలో మార్చి 11న ముల్తాన్‌ సుల్తాన్స్‌, క్వెటా గ్లాడియేటర్స్‌ తలపడ్డాయి. టాస్‌ గెలిచిన గ్లాడియేటర్స్‌ జట్టు తొలుత  బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ముల్తాన్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ పరుగుల సునామీ సృష్టించాడు.

పరుగుల సునామీ
43 బంతుల్లోనే 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఏకంగా 279.07 స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 29 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడు టిమ్‌ డేవిడ్‌ 43, పొలార్డ్‌ 23 పరుగులతో రాణించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

పీఎస్‌ఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్‌ సుల్తాన్స్‌ కేవలం 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. తద్వారా పీఎస్‌ఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌.. 6 పరుగులకే పెవిలియన్‌ చేరాడు.

ఈ క్రమంలో మరో ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ 37, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒమైర్‌ యూసఫ్‌ 67 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరితో పాటు ఐదో స్థానంలో వచ్చిన ఇఫ్తికర్‌ అహ్మద్‌ అర్ధ శతకం(53)తో రాణించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

టోర్నీ నుంచి అవుట్‌
మిగతా వాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో 20 ఓవర్లలో 253 పరుగులు మాత్రమే చేయగలిగింది మహ్మద్‌ నవాజ్‌ బృందం. దీంతో 9 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. 4 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చి గ్లాడియేటర్స్‌ పతనాన్ని శాసించిన అబ్బాస్‌ ఆఫ్రిదికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

515 పరుగులు.. రికార్డు బద్దలు
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఏకంగా 515 పరుగులు నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 చాలెంజ్‌-2022లో టైటాన్స్‌- నైట్స్‌ జట్లు నమోదు చేసిన 501 పరుగుల రికార్డు బద్దలైంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన మ్యాచ్‌గా ముల్తాన్‌- గ్లాడియేటర్స్‌ మ్యాచ్‌ చరిత్రకెక్కింది. 

ముల్తాన్‌ సుల్తాన్స్‌ వర్సెస్‌ క్వెటా గ్లాడియేటర్స్‌ స్కోర్లు:
ముల్తాన్‌ సుల్తాన్స్‌- 262/3 (20)
క్వెటా గ్లాడియేటర్స్‌- 253/8 (20)

చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌!
Usain Bolt: పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం అంటే ఇదేనేమో! అప్పుడు దారితప్పినా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement