మనీలా (ఫిలిప్పీన్స్): భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. వైరస్ వల్ల రెండేళ్ల విరామం తర్వాత ఈ టోర్నీ మంగళవారం నుంచి జరగనుంది. ఒలింపిక్స్ క్రీడల్లో రజతం, కాంస్యం... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన సింధుక ఆసియా టైటిల్ బాకీ ఉంది. గతంలో 2014లో సెమీస్ చేరడం ద్వారా సింధుకు కాంస్యమైతే వచ్చింది. అయితే ఈసారి పతకం రంగు మార్చేందుకు గట్టిపట్టుదలతో బరిలోకి దిగుతోంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో పై యు పొ (చైనీస్ తైపీ)తో సింధు తలపడనుంది.
ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్... సిమ్ యుజిన్ (కొరియా)తో పోటీపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఐదో సీడ్‌గా, కిడాంబి శ్రీకాంత్ ఏడో సీడ్‌గా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ రన్నరప్ లక్ష్యసేన్ చైనాకు చెందిన లి షి ఫెంగ్‌ను ఎదుర్కోనుండగా, శ్రీకాంత్... మలేసియా ప్రత్యర్థి ఎన్జీ తే యంగ్‌తో తలపడతాడు. ఇంకా సాయి ప్రణీత్, పురుషుల డబుల్స్‌లో స్టార్ జోడీ సాత్విక్–చిరాగ్ షెట్టి, కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ బరిలో ఉన్నారు. గాయాలతో సింగిల్స్‌లో ప్రణయ్, మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ వైదొలిగాయి.
Comments
Please login to add a commentAdd a comment