
చంఢీగడ్: రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాతియా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున సిక్సర్లతో అదరగొట్టిన ఈ హర్యానా కుర్రాడు..బుధవారం నిశ్చితార్ధం చేసుకున్నాడు. నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అభిమానులతో సహా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు వీరి జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తెవాతియాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీశ్ రాణా, అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ తదితరులు ఉన్నారు.
తెవాతియా చివరిసారిగా హర్యానా తరపున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో హర్యానా క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. కాగా, తెవాతియాను ఐపీఎల్ వేళానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు అంటిపెట్టుకుంది. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన తెవాతియా గతేడాది ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పేసర్ షెల్టన్ కాట్రెల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది వెలుగులోకి వచ్చాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన మరో ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ కూడా మంగళవారం వివాహం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment