Ranji Trophy 2024 Kerala Vs Mumbai -Shivam Dube: టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల అఫ్గనిస్తాన్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో ఈ ముంబై బ్యాటర్ వరుస అర్ధ శతకాలతో అలరించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. కీలక సమయాల్లో రెండు వికెట్లు కూడా తీసి జట్టు విజయాల్లో భాగమయ్యాడు.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్
మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి 124 పరుగులు సాధించిన దూబే.. టీమిండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటికీ.. తాజా ప్రదర్శనతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడీ బౌలింగ్ ఆల్‌రౌండర్.
ఇక ఇప్పటికే టీమిండియా తరఫున టీ20, వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన శివం దూబే.. టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకోవడంపై దృష్టి సారించాడు. ఇందులో భాగంగా రంజీ ట్రోఫీ-2024లో ముంబై తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో చెలరేగి సత్తా చాటాడు.
రహానే గోల్డెన్ డక్
ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా కేరళ- ముంబై మధ్య శుక్రవారం మ్యాచ్ మొదలైంది. తిరువనంతపురం వేదికగా టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ అజింక్య రహానే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన కేరళ పేసర్ బాసిల్ థంపి.. తొలి బంతికే ఓపెనర్ జై గోకుల్ బిస్తాను అవుట్ చేశాడు.
అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రహానేను కూడా గోల్డెన్ డక్ చేశాడు. ఇలా ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన వేళ మరో ఓపెనర్ భూపేన్ లల్వానీ ఆచితూచి ఆడాడు.
దూబే హాఫ్ సెంచరీ
మిగతా వాళ్లలో సువేద్ పార్కర్(18), ప్రసాద్ పవార్(28) ఓ మోస్తరుగా రాణించగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన శివం దూబే.. లల్వానీతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పాడు. లల్వానీ(50), దూబే(72 బంతుల్లో 51 రన్స్)లతో పాటు.. తనూష్ కొటైన్(56) కూడా అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. ఈ ముగ్గురి ప్రదర్శన కారణంగా తొలి రోజు ఆట ముగిసే సరికి ముంబై 78.4 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇక.. టీమిండియాలో రీఎంట్రీ ఇస్తానని ధీమాగా ఉన్న ముంబై కెప్టెన్ అజింక్య రహానే విఫలం కావడం.. అదే సమయంలో శివం దూబే హాఫ్ సెంచరీతో సత్తా చాటడం శుక్రవారం నాటి ఆటలో హైలెట్‌గా నిలిచాయి.
చదవండి: #Viratkohli: కోహ్లి ఆ రన్స్ సేవ్ చేయడం వల్లే ఇదంతా.. రోహిత్ రియాక్షన్ చూశారా?
Comments
Please login to add a commentAdd a comment