బెంగళూరు: ప్రతిష్టాత్మక దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీని అందుకునేందుకు మధ్యప్రదేశ్ మరింత చేరువైంది. ముంబైతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ మరో రోజు ఆట (కనీసం 95 ఓవర్లు) మాత్రమే మిగిలి ఉండగా... ముంబై లక్ష్యాన్ని నిర్దేశించి ఆపై మధ్యప్రదేశ్‌ను ఆలౌట్ చేయడం దాదాపు అసాధ్యమే! పిచ్ కూడా ఇంకా బ్యాటింగ్‌కు సహకరిస్తుండటంతో ఒకే రోజు పెద్ద సంఖ్యలో వికెట్లు కూలే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో 41 సార్లు విజేత ముంబైపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మధ్యప్రదేశ్ తొలిసారి చాంపియన్‌గా అవతరించనుంది. శనివారం ఆట ముగిసే సమయానికి ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ప్రస్తుతం ముంబై మరో 49 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగులకు ఆలౌటై 162 పరుగుల ఆధిక్యం సాధించింది. రజత్ పటిదార్ (122; 20 ఫోర్లు) శతకంతో సత్తా చాటాడు.
రాణించిన సారాంశ్...
ఓవర్‌నైట్ స్కోరు 368/2తో మధ్యప్రదేశ్ నాలుగో రోజు ఆట కొనసాగించింది. మోహిత్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతిని డీప్ కవర్స్ దిశగా ఆడి పటిదార్ రెండు పరుగులు తీయడంతో మధ్యప్రదేశ్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వచ్చేసింది. ఆపై జట్టు ఇంకా ఎన్ని పరుగులు జోడిస్తుందనేది కీలకంగా మారింది. ఈ సమయంలో రజత్ దూకుడైన బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు సాధించాడు. అతనికి సారాంశ్ జైన్ (57; 7 ఫోర్లు) అండగా నిలిచాడు. పటిదార్, సారాంశ్ జోరుతో మధ్యప్రదేశ్ స్కోరు 500 పరుగులు దాటింది. గాయం కారణంగా ముంబై రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ బ్యాటింగ్‌కు దిగలేదు. ప్రత్యర్థికి రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి అవకాశం ఇవ్వరాదని పట్టుదలగా ఉన్న మధ్యప్రదేశ్ బౌలర్లు ముంబై ఇన్నింగ్స్ ఎక్కువ భాగంలో ఆఫ్ స్టంప్‌కు దూరంగా, లెగ్‌స్టంప్‌పై నెగెటివ్ బౌలింగ్ చేస్తూ కట్టడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment