చాలాకాలం తర్వాత రంజీల్లో ఆడుగుపెట్టిన టీమిండియా బ్యాటింగ్ స్టార్లు ఘోరంగా విఫలమయ్యారు. రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు నిన్న ప్రారంభం కాగా.. తొలి రోజు భారత టెస్ట్ జట్టు సభ్యులు రోహిత్ (3), జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (4), రిషబ్ పంత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు.
భారత వన్డే జట్టు సభ్యుడు శ్రేయస్ అయ్యర్ (11), టీమిండియా భవిష్యత్తు తార రుతురాజ్ గైక్వాడ్ (10) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన భారత క్లాసికల్ బ్యాటర్లు రహానే (12), పుజారా (6), హనుమ విహారి (6) కూడా పూర్తిగా తేలిపోయారు. విధ్వంసకర ఆటగాళ్లు రజత్ పాటిదార్ (0), శివమ్ దూబేకు (0) ఖాతా కూడా తెరవలేదు.
టీమిండియా స్టార్ బ్యాటర్ల ప్రదర్శన సెకెండ్ ఇన్నింగ్స్‌లోనైనా మారుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. అయితే వారి ఆశలు ఆదిలోనే అడియాశలయ్యాయి. రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన వీరు సెకెండ్ ఇన్నింగ్స్‌లో గుడి కంటే మెల్ల మేలన్నట్టుగా రెండంకెల స్కోర్లు చేశారు.
రోహిత్ 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేయగా.. జైస్వాల్ 51 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో రోహిత్ క్రీజ్‌లో ఉండింది కొద్ది సేపే అయినా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇదొక్కటే టీమిండియా అభిమానులకు ఊరట కలిగించే విషయం.
మ్యాచ్ విషయానికొస్తే.. జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకు ఆలౌటైన ముంబై, సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదే పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. రెండో రోజు తొలి సెషన్‌లో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.
ముంబై టాప్ త్రీ బ్యాటర్లు రోహిత్ (28), యశస్వి (26), హార్దిక్ తామోర్ (1) ఔట్ కాగా.. అజింక్య రహానే (1), శ్రేయస్ అయ్యర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 25 పరుగులు వెనుకపడి ఉంది. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులు చేసింది. శుభమ్ ఖజూరియా (53), అబిద్ ముస్తాక్ (44) ఓ మోస్తరుగా రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment