2024 ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలో కీలక సభ్యులైన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్‌లను వారి పదవుల నుంచి తప్పించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. అయితే బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫ్ఫిత్‌ను మాత్రం కొనసాగించేందుకు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ సుముఖంగా ఉందని తెలుస్తోంది. కాగా, బాంగర్, హెస్సన్‌లు గత ఐదు సీజన్లుగా ఆర్సీబీతో అనుబంధం కలిగి ఉన్నారు. భారత మాజీ క్రికెటర్ బాంగర్‌ను ఆర్సీబీ యాజమాన్యం 2022లో హెడ్ కోచ్‌గా నియమించుకుంది.
కాగా, వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం దాదాపు అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచి సన్నాహకాలు మొదలుపెట్టాయి. లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఏకంగా తన హెడ్ కోచ్‌ను మార్చేసింది. ఆ జట్టు ఆండీ ఫ్లవర్ స్థానంలో ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ కూడా లక్నో బాటలోనే నడవాలని భావిస్తుంది.
ఇదిలా ఉంటే, విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్, జట్టు నిండా స్టార్లతో నిండిన ఆర్సీబీ ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ సాధించింది లేదు. 2009, 2011 సీజన్లలో మాత్రం ఆ జట్టు కొందరు స్టార్ల పుణ్యమా అని రన్నరప్‌గా నిలిచింది. ఇటీవలే ముగిసిన 2023 సీజన్‌లో అయితే, ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలోనే యాజమాన్యం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment