ఢిల్లీ క్యాపటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కీలకమైన 3 వికెట్లు (4-0-20-3) పడగొట్టి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేస్ బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్సీబీ తరఫున డెబ్యూ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన వైశాఖ్.. డీసీ స్టార్ ప్లేయర్, ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఔట్ చేసి ఐపీఎల్ వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, లలిత్ యాదవ్‌ల వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాసించాడు.
అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబర్చి, రాత్రిరాత్రే స్టార్‌డమ్ తెచ్చుకున్న వైశాఖ్‌ను చూసి అతని తల్లి పుత్రోత్సాహంతో పరవశించిపోయింది. మ్యాచ్ అనంతరం కొడుకును చూడగానే ఆమె పట్టలేనంత ఆనందంతో బిడ్డను ముద్దాడింది. ఈ సన్నివేశాన్ని చూస్తూ పక్కనే ఉన్న తండ్రి మురిసిపోయాడు. 26 ఏళ్ల వైశాఖ్ తమ సొంత ప్రేక్షకుల ముందు తొలి మ్యాచ్‌లోనే విజృంభించడంతో అతని తల్లిదండ్రులు పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోయారు. వైశాఖ్ తల్లి అతన్ని ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోకు ఆర్సీబీ అభిమానులు పిక్చర్ ఆఫ్ ది డే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, నిన్న (ఏప్రిల్ 15) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కోహ్లి (50), బౌలింగ్‌లో విజయ్‌కుమార్ వైశాఖ్ (3/20) రాణించడంతో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది రెండు వరుస పరాజయాల తర్వాత వచ్చిన విజయం (రెండవది).
విజయ్‌కుమార్ వైశాఖ్ గురించి.. కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్ వైశాఖ్ 2020-21 సీజన్‌లో విజయ్‌హజారే ట్రోఫీలో కర్ణాటక తరఫున దేశవాలీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వైశాఖ్.. కర్ణాటక తరఫున 2021-22 రంజీ ట్రోఫీ కూడా ఆడాడు.
వైశాఖ్.. ఇప్పటివరకు 10 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 38 వికెట్లు, 14 టీ20ల్లో 22 వికెట్లు, 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ సందర్భంగా రజత్ పాటిదార్ గాయపడడంతో అతని స్థానంలో వైశాఖ్ ఆర్సీబీలోకి వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment