విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్‌లో ఔటైన మాదిరిగానే రెండో వన్డేలో కూడా సూర్య తన వికెట్‌ను కోల్పోయాడు.
రెండు సార్లు కూడా అతడిని మిచెల్ స్టార్క్ ఎల్బీరూపంలో పెవిలియన్‌కు పంపాడు. ఇక టీ20ల్లో అదరగొట్టి.. వన్డేల్లో విఫలవమవుతున్న సూర్యను పక్కన పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలిచాడు. సూర్యకుమార్‌కు తన లోపాల గురించి బాగా తెలుసునని, అతడు వన్డేల్లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇస్తాడని రోహిత్ తెలిపాడు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు. అప్పటి వరకు అయ్యర్ స్ధానంలో సూర్య కొనసాగుతాడు. సూర్య వైట్‌బాల్ క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడు. ఒకట్రెండు మ్యాచ్‌లతో ఆటగాళ్ల సామర్థ్యాన్ని అంచనా వేయలేం. సూర్య ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు.
అయితే వన్డే ఫార్మాట్‌లో అతడు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఆ విషయం సూర్యకి కూడా తెలుసు. అతడు తన లోపాలను సరిదిద్దుకుని రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నాను. అతడు ఈ రెండు మ్యాచ్‌లతో పాటు ముందు సిరీస్‌లలో రాణించలేదన్న సంగతి నాకు కూడా తెలుసు.
కానీ సూర్య లాంటి అద్భుతమైన ఆటగాడికి జట్టు మెనెజ్‌మెంట్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుంది. మరో 7-8 మ్యాచ్‌లు ఆడితే సూర్య వన్డేల్లోనూ మరింత సౌకర్యవంతంగా ఉంటాడు. అతడు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని రోహిత్ పేర్కొన్నాడు. ఇక సిరీస్ ఫలితాన్ని తెల్చే మూడో వన్డే మార్చి 22న చెన్నై వేదికగా జరగనుంది.
చదవండి: Ind Vs Aus: పాపం సూర్య! అందరూ తననే అంటున్నారు.. అతడి తప్పేం లేదు! నిజానికి..
Comments
Please login to add a commentAdd a comment