వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా ఎనిమిదో సారి పాకిస్తాన్‌ను భారత్ చిత్తు చేసింది.
రోహిత్ మెరుపులు..
కాగా 192 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 31 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(53 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. కింగ్ కోహ్లి మాత్రం కేవలం 16 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అదే విధంగా తొలి వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడిన శుబ్‌మన్ గిల్ కూడా 16 పరుగులు మాత్రమే చేశాడు.
చెలరేగిన బౌలర్లు..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత బౌలర్ల ధాటికి.. 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్, సిరాజ్, బుమ్రా, హార్దిక్, జడేజా తలా రెండు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు.
శార్ధూల్ ఠాకూర్ ఒక్కడే వికెట్ సాధించలేకపోయాడు. ఇక పాకిస్తాన్ బ్యాటర్లలో బాబర్ ఆజం(50),మహ్మద్ రిజ్వాన్(49) టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇక పాకిస్తాన్‌పై విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమ గెలుపుకు కారణం బౌలర్లే అని రోహిత్ కొనియాడాడు.
మా బౌలర్లు మ్యాజిక్ చేశారు: రోహిత్
"ఈ మ్యాచ్‌లో కూడా మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఇది 190 పరుగులు చేయాల్సిన పిచ్ కాదు. ఒక దశలో వారు 280 పరుగులు చేసేలా కన్పించారు. ఎందుకంటే పాకిస్తాన్ తమ ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించింది. మిడిలార్డర్‌లో బాబర్, రిజ్వాన్ కూడా తమ మార్క్‌ను చూపించారు. కానీ సరైన సమయంలో మా బౌలర్లు బంతితో మ్యాజిక్ చేశారు.
నేను ఏ బౌలర్ చేతికి బంతి ఇస్తే వారే వికెట్లు సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా దగ్గర 6 బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే పరిస్థితికి తగ్గట్టు బౌలర్లను ఉపయోగించడం నా బాధ్యత. ప్రత్యర్ది జట్టు, బ్యాటర్లను బట్టి బౌలర్లను మారుస్తూ వచ్చాను. అందుకు తగ్గ ప్రతిఫలం కూడా లభించింది. ఇక బ్యాటింగ్‌లో కూడా మా బాయ్స్ అద్బుతంగా రాణిస్తున్నారు.
వరల్డ్‌కప్‌కు వచ్చేముందు ప్రతీ ఒక్కరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. మేము సరైన ప్రణాళికలతోనే ఈ టోర్నీ బరిలోకి దిగాం. అదే విధంగా మా బ్యాటింగ్ ఆర్డర్స్‌పై కూడా మాకు ఒక క్లారిటీ ఉంది. అది లోస్కోర్ మ్యాచ్ అయినా, హైస్కోరింగ్ మ్యాచ్ అయినా బ్యాటింగ్ అర్డర్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ప్రస్తుతం మా జట్టు సమతుల్యంగా ఉంది.
వరుస విజయాలు నమోదు చేస్తున్నప్పటికీ.. ప్రతీ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ప్రతీ మ్యాచ్‌లో 100 శాతం ఎఫక్ట్ పెట్టడానికి ప్రయత్నిస్తాము. ఈ టోర్నీలో ఏ జట్టును కూడా తేలికగా తీసుకోము. ఈ టోర్నీలో ఉన్న ప్రతీ జట్టు తమదైన రోజును గట్టి పోటీఇవ్వగలదు. ఇదే రిథమ్‌ను మా తదుపరి మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: WC 2023- Ind Vs Pak: వార్ వన్‌సైడ్.. టీమిండియా చేతిలో పాక్ చిత్తు! ఆ రెండూ తప్పితే.. మిగతావన్నీ..
Comments
Please login to add a commentAdd a comment