
మొహాలీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. అ మ్యాచ్‌లో ప్రత్యర్ధి అఫ్గానిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓమర్జాయ్(29), ఇబ్రహీం జద్రాన్(25) రాణించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దుబే ఒక్క వికెట్ సాధించాడు.
అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబే(60 నాటౌట్) హాప్ సెంచరీతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అంతకుముందు బౌలింగ్‌లోనూ దూబే ఓ కీలక వికెట్ పడగొట్టాడు. అతడి ఆల్‌రౌండ్ ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. మొహాలీలో వాతావరణ పరిస్థితులు చాలా కష్టతరంగా ఉన్నప్పటికీ.. తమ కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని రోహిత్ కొనియాడాడు.
"మొహాలీలో విపరీతమైన చలిగా ఉంది. ఫీల్డింగ్‌లో తొలుత బంతి చేతి వేలికి తాకగానే తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. వెంటనే ఫిజియో హాట్ వాటర్ బ్యాగ్స్ తీసుకువచ్చాడు. ఆ తర్వాత వేడి నీటిలో వేలిని ఉంచితే నొప్పి తగ్గింది. ఇక ఈ మ్యాచ్‌లో మాకు చాలా సానుకూలంశాలు ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్‌లో మేము అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం. ఇక్కడ పరిస్థితిలు చాలా క్లిష్టంగా ఉన్నాయి. మా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారు . అదే విధంగా సీమర్లు కూడా అద్భుతంగా రాణించారని" రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో తెలిపాడు.
ఇక ఈ మ్యాచ్‌లో తన రనౌట్ గురించి హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. ఇటువంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. దురదృష్టవశాత్తూ రనౌట్ అయితే ఎవరైనా నిరుత్సాహానికి గురవుతారు. ప్రతీ ఆటగాడు జట్టు విజయంలో భాగం కావాలని కోరుకుంటాడు. నేను కూడా కొన్ని పరుగులు చేయాలనకున్నాను. కానీ కొన్ని సార్లు మనం అనుకున్నది జరగదు. ఏదైనప్పటికీ ఈ మ్యాచ్‌లో మేము గెలిచాం. నేను ఔటైనప్పటికీ గిల్ మ్యాచ్‌ను ఫినిష్ చేయాలని కోరుకున్నాను. కానీ అతడు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఔట్ అయ్యాడు.శివమ్ దూబే, జితేష్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. తిలక్, రింకూ కూడా తమ వంతు పాత్ర పోషించారని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment