జైస్వాల్‌ అద్భుతం.. అతడేమో బిగ్‌ ప్లేయర్‌.. గర్వంగా ఉంది: రోహిత్‌ | Ind vs Afg 2nd T20I: Rohit Sharma Lauds Jaiswal Talent, Dube Is A Big Guy - Sakshi
Sakshi News home page

జైస్వాల్‌ అద్భుతం.. అతడేమో బిగ్‌ ప్లేయర్‌.. గర్వంగా ఉంది: రోహిత్‌ శర్మ

Published Sun, Jan 14 2024 11:16 PM | Last Updated on Mon, Jan 15 2024 8:03 AM

Ind vs Afg 2nd T20I Rohit Sharma Lauds Jaiswal Talent Dube Big Guy Powerful - Sakshi

అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో విజయంపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తానెంతో గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. గత రెండు మ్యాచ్‌లలో తాము అన్ని బాక్సులను టిక్‌ చేశామని.. సమిష్టి ప్రదర్శనతో గెలుపొందామని జట్టును ప్రశంసించాడు.

ముఖ్యంగా విజయాల్లో కీలక పాత్ర పోషించిన శివం దూబే, యశస్వి జైస్వాల్‌లను ఈ సందర్భంగా రోహిత్‌ శర్మ కొనియాడాడు. కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా 2-0తో సొంతం చేసుకుంది.

ఇండోర్‌లో ఆదివారం నాటి టీ20లో ఆరు వికెట్ల తేడాతో జట్టును గెలిపించి.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కుర్రాళ్లు భారత్‌కు విజయాన్ని బహుమతిగా అందించారు. ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కెరీర్‌లో ఇది 150వ అంతర్జాతీయ టీ20 కావడం విశేషం. 

తద్వారా మెన్స్‌ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఇదొక గొప్ప అనుభూతి. 2007లో మొదలైన ఈ ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలతో ఇక్కడిదాకా సాగింది.

ఇక ఈ  సిరీస్‌ విషయానికొస్తే.. మేము ఎలాంటి ప్రయోగాలు చేయాలనుకున్నామో అన్నీ చేశాం. జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామో ముందే స్పష్టంగా వివరించాం.

అందుకు తగ్గట్లుగానే అందరూ రాణించారు. నన్ను గర్వపడేలా చేశారు. గత రెండు మ్యాచ్‌లలో అన్ని విభాగాల్లోనూ అనుకున్న ప్రణాళికలు అమలు చేయగలిగాం.

జైస్వాల్‌ తొలుత టెస్టుల్లో తనను తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు టీ20లలోనూ సత్తా చాటుతున్నాడు. ఆటగాడిగా తన నైపుణ్యాలేమిటో.. సామర్థ్యం ఏపాటిదో మరోసారి చూపించాడు. 

జైస్వాల్‌ ప్రతిభావంతుడు. వైవిధ్యమైన గొప్ప షాట్లు ఆడగలడు. ఇక దూబే బిగ్‌ ప్లేయర్‌. అత్యంత శక్తిమంతమైన ఆటగాడు. స్పిన్నర్ల బౌలింగ్‌ను చిత్తు చేయగలడు. జట్టులోకి వచ్చాడు.. రెండు విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. తన పాత్రను చక్కగా పోషించాడు’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

కాగా దాదాపు నాలుగేళ్ల తర్వాత టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన పేస్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే.. అఫ్గన్‌తో సిరీస్‌లో సత్తా చాటాడు. తొలి టీ20లో ఒక వికెట్‌ తీయడంతో పాటు.. 40 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజేతగా నిలిపాడు.

తాజాగా రెండో టీ20లోనూ ఒక వికెట్‌ తీసిన అతడు.. 32 బంతులు ఎదుర్కొని 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(34 బంతుల్లో 68)తో కలిసి టీమిండియాను గెలిపించాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్‌ రెండు మ్యాచ్‌లలో డకౌట్‌ కాగా.. రెండో టీ20తో పునరాగమనం చేసిన విరాట్‌ కోహ్లి 16 బంతుల్లో 29 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

చదవండి: రీఎంట్రీలో కోహ్లి దంచికొడితే.. జైస్వాల్‌, దూబే దుమ్ములేపారు! అదొక్కటే లోటు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement