PC: BCCI
India vs Afghanistan, 2nd T20I: అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో టీమిండియా జయభేరి మోగించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది.
టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఆడుతున్న ఆఖరిదైన ద్వైపాక్షిక సిరీస్‌లో అఫ్గన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ సత్తా చాటుకుంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లే ఈ విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం.
కాగా టీమిండియాతో తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గైర్హాజరీలో యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.
172 పరుగులకు అఫ్గన్ ఆలౌట్
ఈ క్రమంలో మొహాలీ వేదికగా తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిన అఫ్గన్ జట్టు.. ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇండోర్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జద్రాన్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది.
టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, రవి బిష్ణోయి రెండు, అక్షర్ పటేల్ రెండు, శివం దూబే ఒక వికెట్ పడగొట్టారు. రనౌట్ల రూపంలో రెండు వికెట్లు వచ్చాయి. కాగా గుల్బదిన్ నైబ్ (35 బంతుల్లో 57), కరీం జనత్(10 బంతుల్లో 20), ముజీబ్ ఉర్ రహ్మాన్(9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ మేరకు స్కోరు చేయగలిగింది.
ఇది మెరుగైన స్కోరే అయినప్పటికీ.. పరుగుల వరదపారించడానికి వీలైన హోల్కర్ స్టేడియంలో టీమిండియాను నిలువరించడం అంతతేలిక కాదని అఫ్గన్‌కు త్వరగానే అర్థమైంది.
ఇండియా ఇన్నింగ్స్‌లో ఐదో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేసినప్పటికీ.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అఫ్గన్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. విరాట్ కోహ్లి (16 బంతుల్లో 29 పరుగులు) కూడా త్వరగానే పెవిలియన్ చేరినా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు.
కోహ్లి దంచికొడితే.. జైస్వాల్, దూబే దుమ్ములేపారు
కోహ్లి స్థానంలో క్రీజులోకి వచ్చిన శివం దూబేతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జైస్వాల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగి 68 పరుగులు సాధించగా.. దూబే 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు.
వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 15.4 ఓవర్లలోనే టీమిండియా అఫ్గన్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. కీలక సమయంలో అఫ్గన్ కీలక వికెట్లు(జద్రాన్, గుల్బదిన్) తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
అదొక్కటే లోటు
అంతాబాగానే ఉన్నా తొలి టీ20 మాదిరే రెండో టీ20లోనూ రోహిత్ శర్మ డకౌట్ కావడం అభిమానులకు నిరాశ కలిగింది. రీఎంట్రీలో హిట్‌మ్యాన్ మెరుపులు చూడాలనుకుంటే ఆ లోటు ఇప్పటికి అలాగే మిగిలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment