టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జొహనెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల ఘనతతో (10-0-37-5) విజృంభించిన ఈ పంజాబీ యువ పేసర్.. వన్డేల్లో దక్షిణాఫ్రికాపై ఆ దేశంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అర్ష్‌దీప్‌కు ముందు సౌతాఫ్రికాపై పలువురు భారత బౌలర్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా వాళ్లంతా స్పిన్నర్లే కావడం గమనార్హం.
1999లో సునీల్ జోషి (5/6), 2018లో చహల్ (5/22), 2023లో రవీంద్ర జడేజా (5/33) సౌతాఫ్రికాపై ఐదు వికెట్ల ఘనత సాధించారు. వీరిలోనూ చహల్ ఒక్కడే సౌతాఫ్రికాపై ఆ దేశంలో ఐదు వికెట్ల ఘనత సాధించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. అర్ష్‌దీప్‌తో పాటు మరో పేసర్ ఆవేశ్ ఖాన్ (8-3-27-4) కూడా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో భారత పేస్ విభాగం గతంలో ఎన్నడూ లేని విధంగా 9 వికెట్లు పడగొట్టింది. 1993 మొహాలీలో, 2013 సెంచూరియన్‌లో జరిగిన వన్డేల్లో టీమిండియా పేసర్లు 8 వికెట్లు పడగొట్టగా.. తాజాగా అర్ష్‌దీప్, ఆవేశ్ ఖాన్ ఆ రికార్డులను అధిగమించి, నయా రికార్డు నెలకొల్పారు.
ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించిన భారత్..
117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రుతురాజ్ (5) తక్కువ స్కోర్‌కే ఔటైనా.. అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) భారత్‌ను గెలిపించారు. టీమిండియా కేవలం 16.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Comments
Please login to add a commentAdd a comment