సౌతాఫ్రికాతో మూడో టీ20.. రెండు మార్పులు చేయనున్న టీమిండియా..? | IND VS SA: India Planning To Make Two Changes In Third T20 | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాతో మూడో టీ20.. రెండు మార్పులు చేయనున్న టీమిండియా..?

Published Tue, Nov 12 2024 5:58 PM | Last Updated on Tue, Nov 12 2024 6:11 PM

IND VS SA: India Planning To Make Two Changes In Third T20

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలువగా.. రెండో టీ20లో దక్షిణాఫ్రికా జయభేరి మోగించింది. మూడో టీ20 సెంచూరియన్‌ వేదికగా రేపు (నవంబర్‌ 13) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది.

రెండో టీ20లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చివరి నిమిషం వరకు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. అయితే ట్రిస్టన్‌ స్టబ్స్‌, గెరాల్డ్‌ కొయెట్జీ చివర్లో సూపర్‌గా బ్యాటింగ్‌ చేసి భారత్‌ చేతుల నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో​ భారత యూనిట్‌లో పలు లోపాలు స్పష్టంగా కనిపించాయి.

మూడో మ్యాచ్‌లో ఈ లోపాలను సరిదిద్దుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. బ్యాటింగ్‌ విభాగంలో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లో అతను దారుణంగా నిరాశపరిచాడు.

వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ అభిషేక్‌ను పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అభిషేక్‌ స్థానంలో తిలక్‌ వర్మ, రమన్‌దీప్‌ సింగ్‌లలో ఎవరో ఒకరితో ఓపెనింగ్‌ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం​. తిలక్‌ వర్మతో పోలిస్తే రమన్‌దీప్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రమన్‌దీప్‌కు హార్డ్‌ హిట్టింగ్‌తో పాటు బౌలింగ్‌ చేయగల సామర్థ్యం కూడా ఉంది. తిలక్‌ వర్మ మిడిలార్డర్‌లో ఎలాగూ సెట్‌ అయ్యాడు కాబట్టి టీమిండియా యాజమాన్యం అతన్ని కదిపే సాహసం చేయకపోవచ్చు.  

మూడో టీ20లో అభిషేక్‌తో పాటు అర్షదీప్‌ సింగ్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అర్షదీప్‌ గత రెండు టీ20ల్లో చెప్పుకోదగ్గ ప్రదదర్శనలు చేయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ కారణంగా అతన్ని పక్కకు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అర్షదీప్‌ను తుది జట్టు నుంచి తప్పిస్తే, అతని​ స్థానంలో యశ్‌ దయాల్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడో టీ20లో రమన్‌దీప్‌, యశ్‌ దయాల్‌ ఇద్దరూ బరిలోకి దిగితే వారిద్దరికి అది అరంగేట్రం మ్యాచ్‌ అవుతుంది.

భారత జట్టు (అంచనా): రమణ్‌దీప్ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, యష్ దయాల్, ఆవేశ్ ఖాన్.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement