సౌతాఫ్రికాతో మొదటి టీ20లో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో అదే జోరును కొనసాగించలేకపోయింది. కీలక బ్యాటర్లంతా విఫలం కావడంతో మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్ గెలవాలంటే.. మిగిలిన రెండు టీ20లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
సంజూ శాంసన్ ధనాధన్ సెంచరీ వల్ల
నిజానికి డర్బన్‌లో జరిగిన తొలి టీ20లోనూ ఓపెనర్ సంజూ శాంసన్(50 బంతుల్లో 107), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(33) రాణించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. మిగతా వాళ్లంతా విఫలమైనా 202 రన్స్ రాబట్టగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య ప్రొటిస్‌ను భారత బౌలర్లు కట్టడి చేయడంతో 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
రెండో టీ20లో మాత్రం
అయితే, గెబెహా వేదికగా రెండో టీ20లో మాత్రం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(0) అనూహ్య రీతిలో డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ(4) మరోసారి విఫలమయ్యాడు.
కెప్టెన్ సూర్య సైతం నాలుగు పరుగులకే వెనుదిరగగా.. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ(20), అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) కాసేపు క్రీజులో నిలబడ్డారు.
ఇక లోయర్ ఆర్డర్‌లో రింకూ సింగ్(9) నిరాశపరచగా.. టెయిలెండర్ అర్ష్‌దీప్ సింగ్(7 నాటౌట్) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా కేవలం 124 పరుగులే చేసింది. అయితే, సౌతాఫ్రికాను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు మాత్రం ఆఖరి వరకు గట్టి పోరాటం చేశాడు.
అయినప్పటికీ 19 ఓవర్లలోనే ప్రొటిస్ జట్టు లక్ష్యాన్ని ఛేదించి జయభేరి మోగించింది. టీమిండియా ఆధిక్యాన్ని తగ్గిస్తూ 1-1తో సమం చేసింది. ఇలా తొలి రెండు మ్యాచ్‌లలోనూ బౌలర్లు వందశాతం పాసైనా.. బ్యాటర్లలోనే నిలకడ లోపించింది.
ఆల్‌రౌండర్ అవసరం ఉంది
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా- టీమిండియా మధ్య సెంచూరియన్ వేదికగా మూడో టీ20పై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సూర్య సేన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలదు. ఈ క్రమంలో భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు.
సౌతాఫ్రికాతో మూడో టీ20లో ఆల్‌రౌండర్ రమణ్‌దీప్ సింగ్‌ను అరంగ్రేటం చేయించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఈ మేరకు.. ‘‘ఎనిమిదో స్థానంలో మనకు ఓ ఆల్‌రౌండర్ అవసరం ఉంది. అతడు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేయగలగాలి.
అతడిని ఆడిస్తేనే మంచిది
అతడు స్పిన్నరా? లేదంటే ఫాస్ట్ బౌలరా అన్న అంశంతో మనకు పనిలేదు. హార్దిక్ పాండ్యా కాకుండా.. అతడిలా ఆడగలిగే మరో క్రికెటర్ కావాలి. ఇప్పుడు జట్టులో ఉన్న ప్రధాన లోటు అదే. ప్రస్తుతం రమణ్‌దీప్ సింగ్ సరైన ఆప్షన్‌లా కనిపిస్తున్నాడు. అందుకే అతడిని తుదిజట్టులో ఆడిస్తే మంచిది’’ అని రాబిన్ ఊతప్ప జియో సినిమా షోలో పేర్కొన్నాడు.
కాగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జట్టుతో ఉన్నాడు. అయితే, రమణ్‌దీప్ సింగ్‌కు లైన్ క్లియర్ కావాలంటే.. మిగిలిన ఆటగాళ్లలో ఎవరో ఒకరిపై వేటు తప్పదు.
అలాంటి పరిస్థితిలో తొలి రెండు టీ20లలో ఘోరంగా విఫలమైన ఏకక ఆటగాడు అభిషేక్ శర్మ(7, 4)నే తప్పించే అవకాశమే ఎక్కువగా ఉంది. అదే జరిగితే ఓపెనింగ్ జోడీలోనూ మార్పు వస్తుంది. కాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సూర్యకుమార్ సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.
చదవండి: టీమిండియాకు గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment