మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తమిళనాడు యువ ఆటగాడు సాయి సుదర్శన్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన సుదర్శన్.. 43 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
తొలి వన్డేలోనే హాఫ్ సెంచరీతో రాణించిన సాయి.. రాబిన్ ఉతప్ప (2006లో ఇంగ్లండ్‌పై 86 పరుగులు), కేఎల్ రాహుల్ (2016లో జింబాబ్వేపై 100 నాటౌట్), ఫయాజ్ ఫజల్ (2016లో జింబాబ్వేపై 55 నాటౌట్) తర్వాత అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సాధించిన నాలుగో భారత
ఓపెనర్‌గా.. వన్డే డెబ్యూలో 50 ప్లస్ స్కోర్ సాధించిన 17వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 22 ఏళ్ల సాయి సుదర్శన్ 2022 సీజన్‌తో గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసి అద్భుతంగా రాణించాడు. రెండు సీజన్లలో 13 మ్యాచ్‌లు ఆడిన సాయి.. 4 అర్దసెంచరీల సాయంతో 46.09 సగటున 507 పరుగులు సాధించాడు.
ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అర్ష్‌దీప్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) భారత్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో వన్డే డిసెంబర్ 19న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment