అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి సమం చేశాడు. గత కొద్ది రోజులుగా ఊరిస్తున్న 49వ సెంచరీని ఎట్టకేలకు తన 35వ పుట్టిన రోజున అందుకున్నాడు.
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కింగ్ కోహ్లి.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. తన కెరీర్‌లో 463 వన్డేలు ఆడిన సచిన్ .. 452 ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు చేశాడు. అటు రన్ మిషన్ కోహ్లి మాత్రం 277 ఇన్నింగ్స్‌లోనే.. ఈ రికార్డును సమం చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ అనంతరం తన 49వ సెంచరీపై కోహ్లి స్పందించాడు.
"ఈడెన్ గార్డెన్స్ వికెట్ బ్యాటింగ్‌కు కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ రోహిత్, శుబ్‌మన్ నుంచి మాకు అద్బుతమైన ఆరంభం లభించింది. దానిని కొనసాగించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. 10వ ఓవర్ తర్వాత బంతి అద్భుతంగా టర్న్ అయింది. ఆ సమయంలో స్పిన్నర్లు ఎదుర్కొవడం కష్టమన్పించింది. అదే విధంగా పిచ్ కూడా కొంచెం నెమ్మదిగా మారింది.
కాబట్టి ఆఖరి వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నాను. నా రోల్ కూడా అదే. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి కూడా అదే సందేశం వచ్చింది. శ్రేయస్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కొంచెం దూకుడుగా ఆడి స్కోరింగ్ రేటును పెంచాడు. ముఖ్యంగా నెంబర్ 3, 4 ఆటగాళ్ల నుంచి మంచి ఇన్నింగ్స్‌లు జట్టుకు అవసరం.
ఇప్పటికే హార్దిక్ సేవలను మేము కోల్పోయాం. కాబట్టి మిడిలార్డర్‌లో భాగస్వామ్యం ఎంత కీలకమో మాకు తెలుసు. మిడిలార్డర్లో ఒకట్రెండు వికెట్లు కోల్పోతే జట్టు కష్టాల్లో పడుతోంది. జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించే అవకాశమిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ప్రఖ్యాత వేదిక, ఇంతమంది ప్రేక్షకులు ముందు నా పుట్టిన రోజున సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉందని. ఏ ప్లేయర్‌కు అయినా ఇదొక కల" అంటూ ఇన్నింగ్స్ బ్రేక్‌లో కోహ్లి పేర్కొన్నాడు.
చదవండి: World cup 2023: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. 49వ సెంచరీ! సచిన్ వరల్డ్ రికార్డు సమం
Comments
Please login to add a commentAdd a comment