మయాంక్‌ మెరుపు బౌలింగ్‌ | Second win for Super giants | Sakshi
Sakshi News home page

మయాంక్‌ మెరుపు బౌలింగ్‌

Published Wed, Apr 3 2024 4:37 AM | Last Updated on Wed, Apr 3 2024 11:43 AM

Second win for Super giants - Sakshi

హడలెత్తించిన లక్నో పేస్‌ బౌలర్‌

సూపర్‌ జెయింట్స్‌కు రెండో విజయం

రాణించిన డికాక్, పూరన్‌

28 పరుగులతో ఓడిన బెంగళూరు  

బెంగళూరు: అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నిప్పులు చెరిగే బంతులతో మరోసారి లక్నో పేస్‌ బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌ హడలెత్తించాడు. వేగానికితోడు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసి ఐపీఎల్‌ టోర్నీ లో లక్నో జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. మయాంక్‌ (3/14) దెబ్బకు సొంతగడ్డపై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది.

మయాంక్‌తోపాటు డికాక్, నికోలస్‌ పూరన్‌ రాణించడంతో... మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 28 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్‌ డికాక్‌ (56 బంతుల్లో 81; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), పూరన్‌ (21 బంతుల్లో 40 నాటౌట్‌; 1 ఫోర్, 5 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది.

మహిపాల్‌ లామ్రోర్‌ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ ఆట ఆడగా... పటిదార్, గ్రీన్, మ్యాక్స్‌వెల్‌ వికెట్లను తీసి లక్నో విజయంలో కీలకపాత్ర పోషించిన మయాంక్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ మయాంక్‌ మూడు వికెట్టు పడగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం అందుకున్నాడు.  

డికాక్, పూరన్‌ మెరుపులతో... 
లక్నో జట్టు ఓపెనర్‌ డికాక్‌ ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టాప్లీ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో అతను 3 బౌండరీలు, సిరాజ్‌ మూడో ఓవర్లో 2 సిక్స్‌లు బాదాడు. దీంతో కెపె్టన్‌ కేఎల్‌ రాహుల్‌ (20; 2 సిక్స్‌లు) తక్కువే చేసినా... దేవదత్‌ పడిక్కల్‌ (6) విఫలమైనా... లక్నో ఇన్నింగ్స్‌పై ఏమాత్రం ప్రభావం పడలేదు.

36 బంతుల్లో డికాక్‌ ఫిఫ్టీ పూర్తవగా జట్టు స్కోరు 12వ ఓవర్లోనే వందకు చేరింది. స్టొయినిస్‌ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించగా, ఆఖర్లో పూరన్‌ మెరుపులతో లక్నో భారీస్కోరు చేయగలిగింది. 19, 20వ ఓవర్లను పూర్తిగా ఆడిన పూరన్‌ 5 సిక్స్‌లతో 33 పరుగులు పిండుకున్నాడు.  



కోహ్లి అవుటవడంతోనే... 
బెంగళూరు ఇన్నింగ్స్‌ ఆరంభంలో కొద్ది సేపే బాగుంది. కెపె్టన్‌ డు ప్లెసిస్‌ బౌండరీలతో వేగం పెంచగా, నవీనుల్‌ నాలుగో ఓవర్లో కోహ్లి సిక్స్‌తో టచ్‌లోకి వచ్చాడు. మరుసటి ఓవర్‌ తొలి బంతికి కోహ్లి ఫోర్‌ కొట్టడంతో స్కోరు 40/0 వద్ద బాగానే ఉంది. అక్కడే కోహ్లి నిష్క్రష్కమించగా, మరుసటి ఓవర్లో డుప్లెసిస్‌ (19; 3 ఫోర్లు) రనౌటయ్యాడు.

చెత్త షాట్‌ ఆడిన మ్యాక్స్‌వెల్‌ (0) పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతే 43 పరుగులకే ముగ్గురు హిట్టర్లను కోల్పోయిన బెంగళూరు కష్టాల్లో పడింది. మయాంక్‌ అద్భుత బంతికి గ్రీన్‌ (9) బౌల్డ్‌ కాగా.. అనూజ్‌ (11) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన లామ్రోర్‌ సిక్స్‌లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. 20 బంతుల్లో 46 పరుగుల సమీకరణం ఆర్‌సీబీలో కొత్త ఆశలు రేపగా... మరుసటి బంతికి కార్తీక్‌ (4) అవుట్‌ కావడంతోనే బెంగళూరు ఖేల్‌ ఖతమైంది. 

స్కోరు వివరాలు 
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) డాగర్‌ (బి) టాప్లీ 81; కేఎల్‌ రాహుల్‌ (సి) డాగర్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 20; పడిక్కల్‌ (సి) అనూజ్‌ (బి) సిరాజ్‌ 6; స్టొయినిస్‌ (సి) డాగర్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 24; పూరన్‌ (నాటౌట్‌) 40; బదోని (సి) డుప్లెసిస్‌ (బి) యశ్‌ దయాళ్‌ 0; కృనాల్‌ పాండ్యా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం 
(20 ఓవర్లలో 5 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–53, 2–73, 3–129, 4–143, 5–148. 
బౌలింగ్‌: రీస్‌ టాప్లీ 4–0–39–1, యశ్‌ దయాళ్‌ 4–0–24–1, సిరాజ్‌ 4–0–47–1, మ్యాక్స్‌వెల్‌ 4–0–23–2, మయాంక్‌ డాగర్‌ 2–0–23–0, గ్రీన్‌ 2–0–25–0. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) పడిక్కల్‌ (బి) సిద్ధార్థ్‌ 22; డుప్లెసిస్‌ (రనౌట్‌) 19; పటిదార్‌ (సి) పడిక్కల్‌ (బి) మయాంక్‌ యాదవ్‌ 29; మ్యాక్స్‌వెల్‌ (సి) పూరన్‌ (బి) మయాంక్‌ యాదవ్‌ 0; గ్రీన్‌ (బి) మయాంక్‌ యాదవ్‌ 9; అనూజ్‌ (సి) పడిక్కల్‌ (బి) స్టొయినిస్‌ 11; మహిపాల్‌ (సి) పూరన్‌ (బి) యశ్‌ ఠాకూర్‌ 33; దినేశ్‌ కార్తీక్‌ (సి) రాహుల్‌ (బి) నవీనుల్‌ 4; మయాంక్‌ డాగర్‌ (రనౌట్‌) 0; టాప్లీ (నాటౌట్‌) 3; సిరాజ్‌ (సి) పూరన్‌ (బి) నవీనుల్‌ 12; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 153. వికెట్ల పతనం: 1–40, 2–42, 3–43, 4–58, 5–94, 6–103, 7–136, 8–137, 9–138, 10–153. బౌలింగ్‌: సిద్ధార్థ్‌ 3–0–21–1, కృనాల్‌ పాండ్యా 1–0–10–0, నవీనుల్‌ 3.4–0–25–2, మయాంక్‌ యాదవ్‌ 4–0–14–3, రవి బిష్ణోయ్‌ 3–0–33–0, యశ్‌ ఠాకూర్‌ 4–0–38–1, స్టొయినిస్‌ 1–0–9–1.  

ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ X కోల్‌కతా 
వేదిక: విశాఖపట్నం 

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement