సొంతగడ్డపై జెయింట్స్ గెలుపు బోణీ
21 పరుగులతో ఓడిన పంజాబ్
బంతితో హడలెత్తించిన మయాంక్
రాణించిన డికాక్, కృనాల్, పూరన్
ఐపీఎల్ కొత్త సీజన్‌ను ఓటమితో మొదలు పెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వెంటనే కోలుకుంది. సొంతగడ్డపై సత్తా చాటి గెలుపు బోణీ చేసింది. బ్యాటింగ్‌లో డికాక్, కృనాల్, పూరన్ కీలక పాత్ర పోషించగా... మయాంక్ యాదవ్, మొహసిన్ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు.
ముఖ్యంగా తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన 21 ఏళ్ల మయాంక్ యాదవ్ తాను వేసిన 24 బంతుల్లో తొమ్మిది బంతులను గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంగా వేయడం విశేషం. భారీ ఛేదనలో 100కు పైగా తొలి వికెట్ భాగస్వామ్యంతో మంచి పునాది వేసుకున్నా... చివరకు పంజాబ్ కింగ్స్‌కు పరాజయం తప్పలేదు. బ్యాటర్ల నిర్లక్ష్యపూరిత షాట్లతో ఆ జట్టు వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.
లక్నో: ఐపీఎల్‌లో లక్నో తొలి విజయంతో పాయింట్ల ఖాతా తెరిచింది. శనివారం జరిగిన పోరులో లక్నో 21 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (38 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కృనాల్ పాండ్యా (22 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (21 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు భారీ స్కోరుకు బాటలు వేశారు.
అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు సాధించింది. శిఖర్ ధావన్ (50 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), జానీ బెయిర్‌స్టో (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 70 బంతుల్లోనే 102 పరుగులు జోడించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ యాదవ్ (3/27) పంజాబ్‌ను దెబ్బ కొట్టాడు.
సమష్టి ప్రదర్శన...
రబాడ ఓవర్లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్‌తో లక్నో ఇన్నింగ్స్‌ను డికాక్ ధాటిగా ప్రారంభించగా... అర్‡్షదీప్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన కేఎల్ రాహుల్ (15) అదే ఓవర్లో వెనుదిరిగాడు. పడిక్కల్ (9) విఫలం కాగా... రాహుల్ చహర్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన స్టొయినిస్ (19) తర్వాతి బంతికే అవుటయ్యాడు. 34 బంతుల్లో డికాక్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... చహర్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో పూరన్ జోరు ప్రదర్శించాడు. పూరన్ వెనుదిరిగిన తర్వాత కృనాల్ కూడా చెలరేగడంతో జట్టు భారీ స్కోరు చేయగలిగింది.
శతక భాగస్వామ్యం...
ఛేదనలో పంజాబ్‌కు ధావన్, బెయిర్‌స్టో ఘనమైన ఆరంభాన్ని అందించారు. సిద్ధార్థ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన ధావన్... మొహసిన్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. దాంతో 6 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 61 పరుగులకు చేరింది. 30 బంతుల్లోనే ధావన్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగా, కృనాల్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లతో బెయిర్‌స్టో దూకుడు చూపించాడు.
ఎట్టకేలకు 12వ ఓవర్లో మయాంక్ యాదవ్ ఈ జోడీని విడదీయగా, క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు ప్రభ్‌సిమ్రన్ (7 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. అయితే 13 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయినపంజాబ్ కింగ్స్ ఓటమి దిశగా పయనించింది. గెలుపు కోసం 23 బంతుల్లో 59 పరుగులు చేయాల్సిన స్థితిలో ధావన్ అవుట్ కావడం జట్టు అవకాశాలకు దాదాపుగా తెర వేసింది.
స్కోరు వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) జితేశ్ (బి) అర్‡్షదీప్ 54; రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) అర్‡్షదీప్ 15; పడిక్కల్ (సి) ధావన్ (బి) స్యామ్ కరన్ 9; స్టొయినిస్ (బి) చహర్ 19; పూరన్ (బి) రబాడ 42; బదోని (సి) బెయిర్‌స్టో (బి) కరన్ 8; కృనాల్ పాండ్యా (నాటౌట్) 43; రవి బిష్ణోయ్ (సి) (సబ్) తనయ్ 0; మొహసిన్ (రనౌట్) 2; నవీన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–35, 2–45, 3–78, 4–125, 5–146, 6–189, 7–189, 8–197. బౌలింగ్: స్యామ్ కరన్ 4–0–28–3, అర్‡్షదీప్ 3–0–30–2, రబాడ 4–0–38–1, రాహుల్ చహర్ 3–0–42–1, హర్‌ప్రీత్ బ్రార్ 2–0–14–0, హర్షల్ పటేల్ 4–0–45–0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (సి) డికాక్ (బి) మొహసిన్ 70; బెయిర్‌స్టో (సి) స్టొయినిస్ (బి) మయాంక్ 42; ప్రభ్‌సిమ్రన్ (సి) నవీన్ (బి) మయాంక్ 19; జితేశ్ (సి) నవీన్ (బి) మయాంక్ 6; లివింగ్‌స్టోన్ (నాటౌట్) 29; కరన్ (సి)పూరన్ (బి) మొహసిన్ 0; శశాంక్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–102, 2–128, 3–139, 4–141, 5–141. బౌలింగ్: సిద్ధార్థ్ 2–0–21–0, నవీన్ 4–0–43–0, మొహసిన్ 4–0–34–2, కృనాల్ 3–0–26–0, బిష్ణోయ్ 3–0–25–0, మయాంక్ యాదవ్ 4–0–27–3.
ఐపీఎల్‌లో నేడు
గుజరాత్ X హైదరాబాద్
వేదిక: అహ్మదాబాద్
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి
ఢిల్లీ X చెన్నై
వేదిక: విశాఖపట్నం
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment