టీమిండియా స్టార్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైన నాటి నుంచి తాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాలని కలగన్నట్లు తెలిపాడు. అందుకు తగ్గట్లుగానే ఆర్సీబీ తనకు అవకాశాలు కూడా ఇచ్చిందని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
కాగా 2013లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టిన కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆ మరుసటి ఏడాది టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా సేవలు అందిస్తూ వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు.
తాజాగా సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా వన్డే జట్టుకు సారథిగా వ్యవహరించి సిరీస్ గెలిపించాడు. తదుపరి టెస్టు సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో చాలా కాలం పాటు పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయాడు.
ఈ క్రమంలో ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌కు నాయకుడిగా ఎంపికయ్యాడు. అయితే, గత రెండు సీజన్లలో లక్నో ప్లే ఆఫ్స్ చేరగలిగింది కానీ.. ఫైనల్ వరకు కూడా రాలేకపోయింది. ఐపీఎల్-2024లోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఎస్‌జీ క్రికెట్‌కు కేఎల్ రాహుల్ ఇచ్చిన ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘ నేను యువకుడిగా ఉన్న సమయంలో నా ప్రతిభను నిరూపించుకునేందుకు ఆర్సీబీ నాకు అవకాశాలు ఇచ్చింది.
బెంగళూరుకు చెందిన నాకు.. ఐపీఎల్ మొదలైన నాటి నుంచే ఆర్సీబీకి ఆడాలనే కోరిక ఉండేది. అందుకు తగ్గట్లుగానే కొన్నేళ్లపాటు ఆ జట్టుకు ఆడే అవకాశం లభించింది. ఆర్సీబీ ఎల్లప్పుడూ నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది’’ అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ కూడా ఐపీఎల్‌లో ఇంత వరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదన్న విషయం తెలిసిందే.
ఇక ఆర్సీబీ తరఫున మొత్తంగా 19 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్.. 417 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్-2016 సీజన్‌లో అత్యుత్తమంగా 397 పరుగులతో రాణించిన రాహుల్.. జట్టును ఫైనల్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా ఈఏడాది ఐపీఎల్ ఎడిషన్‌లో గాయం కారణంగా రాహుల్ మధ్యలోనే లక్నోను వీడగా.. కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించాడు.
చదవండి: రుతురాజ్ స్థానంలో అతడే: బీసీసీఐ ప్రకటన.. సర్ఫరాజ్‌కు మరోసారి మొండిచేయి
Comments
Please login to add a commentAdd a comment