వరల్డ్‌కప్‌ జట్టులో ఉంటాడనుకుంటే.. కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా?! | 'Seemed Like He Could Be In WC Team': Aakash Chopra Questions Umran Malik's Absence - Sakshi
Sakshi News home page

T20 WC: మొన్నటిదాకా ఎక్కడ చూసినా అతడే.. అకస్మాత్తుగా మాయం! ఆ జట్టులోనూ పనికిరాడా?

Published Tue, Jan 9 2024 10:42 AM | Last Updated on Tue, Jan 9 2024 11:07 AM

Seemed Like He Could Be In WC Team: Aakash Chopra Questions Umran Malik Absence - Sakshi

It seemed like he could be in the World Cup team: టీమిండియా సెలక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టమని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ప్రపంచకప్‌-2024 జట్టులో ఉంటాడనుకున్న ఆటగాడిని అకస్మాత్తుగా ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. ఒకప్పుడు ప్రతి సిరీస్‌కు ఎంపికైన ఆ ప్లేయర్‌కు ఇప్పుడు కనీసం భారత్‌-‘ఏ’ జట్టులో కూడా చోటు దక్కకపోవడం ఏమిటని వాపోయాడు.

నెట్‌బౌలర్‌ నుంచి టీమిండియా స్థాయికి
ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతుల్లో జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఒకడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో నెట్‌ బౌలర్‌గా మొదలైన అతడి ప్రయాణం.. టీమిండియాకు ఎంపిక అయ్యే స్థాయికి చేరుకుంది. ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా 2022లో భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌.

అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. తన పదునైన, వేగవంతమైన డెలివరీలతో బ్యాటర్లను తిప్పలు పెట్టడంలో ఉమ్రాన్‌ మాలిక్‌ దిట్ట. ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో కీలక సభ్యుల్లో ఒకడిగా మారాడు ఈ ఫాస్ట్‌బౌలర్‌. అయితే, ఐపీఎల్‌-2023లో పేలవ ప్రదర్శన తర్వాత ఒక్కసారిగా ఉమ్రాన్‌ మాలిక్‌ రాత తలకిందులైంది.

వాళ్లిద్దరికి మాత్రం ఛాన్స్‌లు
ఫామ్‌లేమితో సతమతమవుతున్న అతడికి వెస్టిండీస్‌ టూర్‌ రూపంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కరేబియన్‌ దీవుల్లో ఆడిన రెండు వన్డేల్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకుని జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు ఉమ్రాన్‌. 

అయితే, ఉమ్రాన్‌ మాలిక్‌ మాదిరే అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌లు కూడా వైఫల్యం చెందినా బీసీసీఐ సెలక్టర్లు వారికి అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులోనూ ఉమ్రాన్‌కు స్థానం దక్కకపోగా.. వీరిద్దరు మాత్రం చోటు దక్కించుకోవడం విశేషం.

మొన్నటిదాకా ఎక్కడ చూసినా అతడే
ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ... ‘‘కొంతకాలం క్రితం ఎక్కడ చూసినా ఉమ్రాన్‌ మాలికే కనబడ్డాడు. అతడిని వెస్టిండీస్‌ పర్యటనకు తీసుకువెళ్లారు. ఒకానొక సందర్భంలో అతడు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అందరూ భావించారు.

కానీ.. ఇటీవల వరుస సిరీస్‌లలో అతడికి మొండిచేయే చూపారు. కనీసం ఇండియా-ఏ జట్టుకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. మూడు నెలల కాలంలోనే అంత పెద్ద మార్పులేం జరిగిపోయాయి. 

టీమిండియాలో అడుగుపెట్టి.. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న తర్వాత.. అకస్మాత్తుగా అతడు కనిపించకుండా పోయాడు. అసలు ఉమ్రాన్‌ మాలిక్‌ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. 

ఇలా ఎందుకు జరుగుతోంది?
అతడి విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది అన్న విషయాలను మనం తెలుసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. ఉమ్రాన్‌ మాలిక్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని ఆకాశ్‌ చోప్రా ఈ సందర్భంగా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

కాగా గతేడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో టీ20లో ఉమ్రాన్‌ మాలిక్‌ తన అత్యుత్తమ గణాంకాలు (2/9- 2.1 ఓవర్లలో) నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటి వరకు ఆడిన 10 వన్డేల్లో 13, 8 టీ20లలో 11 వికెట్లు తీశాడు ఉమ్రాన్‌ మాలిక్‌. 

చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్‌: షెడ్యూల్‌, జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement