
వెస్టిండీస్ పర్యటన అనంతరం టీమిండియా మూడు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్‌లో అడుగుపెట్టనుంది. ఆగస్టు 18న డబ్లిన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఐర్లాండ్ టూర్‌కు కూడా భారత ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపనున్నట్లు సమాచారం. ఎందుకంటే అదే నెలలో ఆసియాకప్ ప్రారంభం కానుండడంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అయితే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ చోటు ఆశించి భంగపాటు పడ్డ యువ ఆటగాళ్లకు ఐర్లాండ్ టూర్‌కు సెలక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేష్ వర్మ వంటి ఆటగాళ్లకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
నితీష్ రాణా రీ ఎంట్రీ..
ఇక ఐర్లాండ్ సిరీస్‌కు జట్టు ఎంపిక విషయంలో ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న నితీష్ రాణా.. ఐర్లాండ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. రాణా చివరగా 2021 జూలైలో భారత జట్టు తరపున ఆడాడు. రాణా ఇప్పటి వరకు టీమిండియా తరపున కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోకపోవడంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. అయితే ఐపీఎల్-2023లో నితీష్ అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో.. సెలక్టర్లు అతడికి మళ్లీ పిలుపునివ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది సీజన్‌లో కేకేఆర్‌కు సారధ్యం వహించిన రాణా పర్వాలేదనపించాడు. 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 31.77 సగటుతో 413 పరుగులు చేశాడు.
చదవండి: IND Vs WI 2023: భారత జట్టులో నో ఛాన్స్.. ‘దేవుడు నా కోసం పెద్ద ప్లాన్‌తో ఉన్నాడు’