టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై వేటు పడనుందా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లిని త్వరలో జరుగబోయే దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్‌లకు పరిగణలోకి తీసుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. విశ్రాంతి పేరుతో కోహ్లిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. సఫారీ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసే ముందే ఈ విషయాన్ని కోహ్లికి చేరవేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే పేరుకే సెలెక్టర్లు కోహ్లితో సంప్రదింపులు జరుపుతారని, ఈ విషయమై చేతన్ శర్మ నేతృత్వంలోకి కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని బీసీసీఐ వర్గాల్లో చర్చ సాగుతోంది.
విశ్రాంతి తీసుకోవాలా వద్దా అన్న కోహ్లి అభిమతాన్ని సెలెక్షన్ కమిటీ పట్టించుకునే పరిస్థితిలో లేదని.. రహానే, పుజారాలను టెస్ట్ జట్టులో నుంచి ఎలాగైతే తప్పించారో అదే ఫార్ములాను కోహ్లి విషయంలోనూ అప్లై చేస్తారని సమాచారం. ఫైనల్‌గా సౌతాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్‌లకు కోహ్లిని ఎంపిక చేయకుండా, అతని అభిమతం కనుక్కోకుండా విశ్రాంతి పేరుతో వేటు వేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం లేకపోలేదని కొందరు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్ (2022)లో విరాట్ కోహ్లి ఫామ్ మునుపటితో పోలిస్తే మరింత దిగజారిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతను ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 19.64 సగటున కేవలం 216 పరుగులే (41 నాటౌట్, 12, 5, 48, 1, 12, 0, 0, 9, 58, 30, 0) చేసి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇందులో మూడు గోల్డెన్ డకౌట్లు కూడా ఉండటం అతని ఫ్యాన్స్‌ని సైతం విస్మయానికి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రేయోభిలాషులు, విశ్లేషకులు కోహ్లిని విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే సూచనలను సాకుగా చూపి సెలెక్టర్లు కోహ్లిపై వేటు వేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ మొదలుకానుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు టీ20లు ఆడనుంది. సఫారి సిరీస్ కోసం భారత జట్టును ఐపీఎల్ ముగిసేనాటికి ప్రకటించే అవకాశముంది.
- తొలి టీ20 : జూన్ 9 (ఢిల్లీ)
- రెండో టీ20 : జూన్ 12 (కటక్)
- మూడో టీ20 : జూన్ 14 (వైజాగ్)
- నాలుగో టీ20 : జూన్ 17 (రాజ్‌కోట్)
- ఐదో టీ20 : జూన్ 19 (బెంగళూరు)
చదవండి: ఆసీస్‌తో టి20 సిరీస్.. టి20 ప్రపంచకప్ 2022 లక్ష్యంగా!
Comments
Please login to add a commentAdd a comment