సెరెనా అదిరెన్‌... | Serena Williams record breaking 102 US Open wins | Sakshi
Sakshi News home page

సెరెనా అదిరెన్‌...

Published Thu, Sep 3 2020 5:54 AM | Last Updated on Thu, Sep 3 2020 6:19 AM

Serena Williams record breaking 102 US Open wins - Sakshi

తనకెంతో కలిసొచ్చిన వేదికపై అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ శుభారంభం చేసింది. మార్గరెట్‌ కోర్ట్‌ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ (24) ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేసేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్న 38 ఏళ్ల సెరెనా ఈ క్రమంలో కొత్త రికార్డును సృష్టించింది. యూఎస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్న ప్లేయర్‌గా సెరెనా ఘనత వహించింది.

101 విజయాలతో అమెరికాకే చెందిన మరో దిగ్గజం క్రిస్‌ ఎవర్ట్‌ పేరిట ఇన్నాళ్లూ ఉన్న     రికార్డును 102వ విజయంతో సెరెనా బద్దలు కొట్టింది. 1998లో తొలిసారి యూఎస్‌ ఓపెన్‌లో ఆడిన సెరెనా ఈ మెగా టోర్నీలో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచింది.  ఈసారీ సెరెనా గెలిస్తే అత్యధికసార్లు యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా క్రిస్‌ ఎవర్ట్‌ (6 సార్లు) పేరిటే ఉన్న రికార్డును సవరించి చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది.


న్యూయార్క్‌: కరోనా వైరస్‌ భయంతో యూఎస్‌ ఓపెన్‌ టోర్నీకి టాప్‌–10లోని ఆరుగురు క్రీడాకారిణులు గైర్హాజరీ అయిన స్థితిలో... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... చరిత్రలో స్థానం సంపాదించేందుకు అమెరికా మహిళా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ తొలి అడుగు వేసింది. గత రెండేళ్లలో ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌ ట్రోఫీతోనే సరిపెట్టుకున్న సెరెనా ఈసారి మాత్రం ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ సెరెనా 7–5, 6–3తో తన దేశానికే చెందిన క్రిస్టీ ఆన్‌పై విజయం సాధించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లోసెరెనా 13 ఏస్‌లు సంధించింది.

కెరీర్‌లో 20వసారి యూఎస్‌ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా తాజా గెలుపుతో ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా (పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగాలు కలిపి) తనకంటూ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకుంది. 101 విజయాలతో క్రిస్‌ ఎవర్ట్‌ (అమెరికా) పేరిట ఉన్న ఈ రికార్డును సెరెనా అధిగమించింది. ఒకవేళ సెరెనా ఈసారి చాంపియన్‌గా నిలిస్తే అత్యధికంగా ఏడుసార్లు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పుతుంది.

1998లో ఈ టోర్నీలో అరంగేట్రం చేసిన సెరెనా ఆరుసార్లు విజేతగా (1999, 2002, 2008, 2012, 2013, 2014)... నాలుగుసార్లు రన్నరప్‌గా (2001, 2011, 2018, 2019) నిలిచింది. 2003, 2017లలో సెరెనా ఈ టోర్నీలో ఆడలేదు. యూఎస్‌ ఓపెన్‌కు సన్నాహాల్లో భాగంగా రెండు టోర్నీలు ఆడిన సెరెనా రెండింటిలోనూ క్వార్టర్‌ ఫైనల్‌ దాటలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆమె మూడు సెట్‌లపాటు పోరాడాల్సి వచ్చింది. ‘యూఎస్‌ ఓపెన్‌లో ఆడేందుకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక రికార్డు బద్దలు కొట్టానని నాతో చెబుతుంటారు. అయితే నేనెప్పుడూ రికార్డుల కోసం ఆడలేదు. వాటి గురించి ఆలోచించడంలేదు. టైటిల్‌ గెలవడమే నా ముందున్న లక్ష్యం’ అని సెరెనా వ్యాఖ్యానించింది.

మాజీ చాంపియన్‌ క్లియ్‌స్టర్స్‌కు నిరాశ...


ఎనిమిదేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో పునరాగమనం చేసిన మూడుసార్లు యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ (బెల్జియం)కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో 37 ఏళ్ల క్లియ్‌స్టర్స్‌ 6–3, 5–7, 1–6తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) 6–2, 6–2తో విక్‌మాయెర్‌ (బెల్జియం)పై, తొమ్మిదో సీడ్‌ యోహానా కొంటా (బ్రిటన్‌) 7–6 (9/7), 6–1తో హీథెర్‌ వాట్సన్‌ (బ్రిటన్‌)పై, ఐదో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 7–6 (7/1), 6–4తో ఒషీన్‌ డోడిన్‌ (ఫ్రాన్స్‌)పై, ఏడో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6–1, 6–1తో తిమియా బాబోస్‌ (హంగేరి)పై, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ అజరెంకా (బెలారస్‌) 6–1, 6–2తో బార్బరా హాస్‌ (ఆస్ట్రియా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

మూడో రౌండ్‌లో కెర్బర్, క్విటోవా....
మహిళల సింగిల్స్‌లో మాజీ విజేత కెర్బర్‌ (జర్మనీ), ఆరో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఎనిమిదో సీడ్‌ పెట్రా మార్టిక్‌ (క్రొయేషియా), 14వ సీడ్‌ అనెట్‌ కొంటావె (ఎస్తోనియా) మూడో రౌండ్‌లోకి చేరారు. రెండో రౌండ్‌లో కెర్బర్‌ 6–3, 7–6 (8/6)తో ఫ్రీడ్‌సామ్‌ (జర్మనీ)పై, మార్టిక్‌ 6–3, 6–4తో కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్‌)పై, కొంటావె 6–4, 6–1తో కయా యువన్‌ (స్లొవేనియా)పై, క్విటోవా 7–6 (7/3), 6–2తో కొజ్లోవా (ఉక్రెయిన్‌)పై గెలిచారు. అయితే 12వ సీడ్‌ వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌) 1–6, 2–6తో సస్నోవిచ్‌ (బెలారస్‌) చేతిలో... 30వ సీడ్‌ మ్లాడెనోవిచ్‌ (ఫ్రాన్స్‌) 6–1, 6–7 (2/7), 0–6తో గ్రషెవా (రష్యా) చేతిలో ఓడిపోయారు.
వీనస్‌ రికార్డు...

అత్యధికసార్లు యూఎస్‌ ఓపెన్‌లో ఆడిన క్రీడాకారిణిగా వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) రికార్డు సృష్టించింది. సెరెనా అక్క అయిన 40 ఏళ్ల వీనస్‌ యూఎస్‌ ఓపెన్‌లో 22వసారి బరిలోకి దిగింది. అయితే ఆమెకు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. కరోలినా ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–3, 7–5తో వీనస్‌ను ఓడించింది.
 ఇప్పటిదాకా మార్టినా నవ్రతిలోవా (21 సార్లు) పేరిట ఉన్న రికార్డును వీనస్‌ సవరించింది.

ముర్రే అద్భుతం...

పురుషుల సింగిల్స్‌ విభాగంలో మాజీ చాంపియన్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) అద్భుత విజయం సాధించాడు. దాదాపు 20 నెలల తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ ఆడిన ముర్రే 4–6, 4–6, 7–6 (7/5), 7–6 (7/4), 6–4తో యోషిహిటో నిషియోక (జపాన్‌)పై గెలుపొందాడు. 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే తొలి రెండు సెట్‌లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. వరుసగా రెండు సెట్‌లు చేజార్చుకున్నాక విజయాన్ని అందుకోవడం ముర్రే కెరీర్‌లో ఇది పదోసారి కావడం విశేషం. మూడో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా), రెండో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా), ఎనిమిదో సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌), పదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) కూడా రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.  

దివిజ్‌ శరణ్‌ జంట ఓటమి
పురుషుల డబుల్స్‌లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–నికోలా కాచిచ్‌ (సెర్బియా) జంట తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. శరణ్‌–కాచిచ్‌ ద్వయం 4–6, 6–4, 3–6తో కూలాఫ్‌–మెక్‌టిక్‌ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement