హైదరాబాద్: ఈ నెల 14, 15 తేదీల్లో స్టేడియం ఆఫ్ హోప్ వేదికగా 'సర్వింగ్ త్రూ స్పోర్ట్స్' సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఫ్రీడం కప్-2021 అండర్-17 ఫుట్‌బాల్ టోర్నీలో షబ్బీర్ అలీ ఫుట్‌బాల్ అకాడమీ(సఫా) విజేతగా ఆవిర్భవించింది. ఈ సెవెన్ ఎ సైడ్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో మొత్తం 14 జట్టు పాల్గొనగా.. సఫా, సఫా-బి జట్లు ఫైనల్‌కు చేరాయి. ఫైనల్లో సఫా జట్టు సఫా-బి జట్టుపై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి, ఆడిన తొలి అండర్-17 టోర్నీలోనే విజేతగా ఆవిర్భవించింది. సఫా తరఫున ఇమ్రాన్, ఖాదర్ గోల్స్ సాధించగా.. ఇమ్రాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకుముందు సఫా జట్టు పెట్రా స్పోర్ట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకోగా, అనంతరం యునైటెడ్ ఎఫ్‌సీ(2-0), ఎల్‌ఎస్‌ఏ రీపర్స్(3-1) జట్లపై విజయం సాధంచి సెమీస్‌కు అర్హత సాధించింది. కీలకమైన సెమీస్‌లో సఫా జట్టు రేవన్స్ ఎఫ్‌సీపై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. కాగా, టోర్నీ విజేతగా ఆవిర్భవించిన సఫా జట్టుకు సర్వింగ్ త్రూ స్పోర్ట్స్ సంస్థ అధినేత, ముఖ్య అతిధి శ్రీకాంత్ డేవిడ్ విన్నింగ్ ట్రోఫీని బహుకరించారు. జట్టులో ఆటగాళ్లందరికీ వ్యక్తిగత మెడల్స్ బహుకరించి వారిని అభినందించారు. విన్నింగ్ ట్రోఫీని జట్టు కెప్టెన్ ఖాదర్ అందుకున్నాడు. కాగా, ఈ విషయాన్ని సఫా జట్టు ప్రధాన కోచ్ షబ్బీర్ అలీ ప్రెస్ నోట్ ద్వారా మీడియాకు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment