
Shahrukh Khan: ఢిల్లీతో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ హెచ్ లీగ్ మ్యాచ్ మూడో రోజు ఆటలో తమిళనాడు స్టార్ ఆల్‌రౌండర్, విధ్వంసకర బ్యాటర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ షారుక్ ఖాన్ భారీ శతకంతో చెలరేగాడు. 148 బంతుల్లో 20 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 194 పరుగులు చేసి, 6 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు.
ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో తొలి సెంచరీనే భారీ శతకంగా మలిచిన షారుక్.. సహచర ఆటగాడు బాబా అపరాజిత్ (117 పరుగులు)తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఫలితంగా తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 494 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. షారుక్ ఖాన్, బాబా అపరాజిత్‌తో పాటు కౌశిక్ గాంధీ (55), వికెట్‌కీపర్ జగదీశన్ (50) అర్ధ శతకాలతో రాణించడంతో తమిళనాడుకు 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బాట్యింగ్‌కు దిగిన ఢిల్లీ.. యశ్ ధుల్ (113), లలిత్ యాదవ్ (177) శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 452 పరుగులు చేసి ఆలౌటైంది.
కాగా, షారుక్ ఖాన్ భారీ ఇన్నింగ్స్ తమిళనాడు కంటే అతన్ని ఇటీవల తిరిగి కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ జట్టునే ఎక్కువగా సంతోషపరిచిందని చెప్పాలి. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో పంజాబ్ జట్టు షారుక్‌ను ఏకంగా 9 కోట్లకు కొనుగోలు చేసి అందరీ ఆశ్చర్యంలో ముంచెత్తింది
చదవండి: షారుక్ ఖాన్, సాయి కిషోర్‌లకి బంపర్ ఆఫర్.. ఏకంగా టీమిండియాకు!