PC: PCB
Asia Cup 2022: పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది గాయంపై ఆ దేశ క్రికెట్ బోర్డు అప్‌డేట్ ఇచ్చింది. మెరుగైన చికిత్స కోసం అతడిని లండన్‌కు పంపించినట్లు తెలిపింది. టీ20 ప్రపంచకప్-2022 ఆరంభానికి ముందే అతడు కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా జూలైలో శ్రీలంకతో మొదటి టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆఫ్రిది గాయపడ్డాడు. మోకాలి గాయం తీవ్రతరం కావడంతో ఆసియా కప్-2022 టోర్నీకి దూరమయ్యాడు.
ఈ నేపథ్యంలో కీలక బౌలర్ లేకుండానే ఆసియా కప్ బరిలో దిగింది పాకిస్తాన్. అయితే, 22 ఏళ్ల షాహిన్ ఆఫ్రిది మాత్రం ఇప్పటి వరకు జట్టుతోనే ప్రయాణం చేశాడు. దుబాయ్‌లో భారత్‌తో పాక్ మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ నేపథ్యంలో ఆఫ్రిది ఆరోగ్య పరిస్థితిని మరోసారి పర్యవేక్షించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మెడికల్ అడ్వైజరీ పానెల్.. అతడిని లండన్‌కు పంపించేందుకు నిర్ణయించింది.
ఇందుకు సంబంధించిన వివరాలను పీసీబీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నజీబుల్లా సోమ్రో వెల్లడించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘మోకాలి నొప్పితో బాధపడుతున్న షాహిన్ ఆఫ్రిదికి నిరంతరాయంగా సేవలు అందించే ఓ స్పెషలిస్టు కావాలి. ప్రత్యేక వైద్యం అందించాలి.
ప్రపంచంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ మెడికల్, రీహాబిలిటేషన్ సెంటర్లు లండన్‌లో ఉన్నాయి. అందుకే మా ఆటగాడికి మెరుగైన చికిత్స అందించే దృష్ట్యా అతడిని అక్కడికి పంపుతున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా టీ20 వరల్డ్‌కప్-2022 అక్టోబరు 16న ఆరంభం కానుంది. అప్పటి వరకు ఆఫ్రిది కోలుకోనట్లయితే పాక్‌కు కష్టాలు తప్పవు. ఇదిలా ఉంటే.. భారత్‌తో మ్యాచ్‌లో ఓటమితో బాబర్ ఆజం బృందం ఆసియాకప్ టోర్నీ ప్రయాణం ఆరంభించింది. షాహిన్ ఆఫ్రిది స్థానంలో హస్నైన్ జట్టులోకి వచ్చాడు.
చదవండి: IND vs PAK: రోజుకు 150 సిక్స్‌లు కొడుతున్నా అన్నావు.. ఇప్పుడు ఏమైంది భయ్యా నీకు?
Shubman Gill: ‘సారా’తో దుబాయ్‌లో శుబ్‌మన్ గిల్.. ఫొటో వైరల్! అయితే ఈసారి..
Comments
Please login to add a commentAdd a comment