ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు సత్తా చాటారు. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అఫ్రిది ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇరగదీశాడు. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో అఫ్రిది 12.62 సగటున ఎనిమిది వికెట్లు తీశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిది మూడు స్థానాలు ఎగబాకగా.. టాప్ ప్లేస్‌లో ఉండిన కేశవ్ మహారాజ్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిదితో పాటు అతని సహచరుడు హరీస్ రౌఫ్ కూడా భారీగా లబ్ది పొందాడు. ఆసీస్‌పై సంచలన ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు) అనంతరం రౌఫ్ 14 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్తానానికి ఎగబకాడు. అలాగే మరో పాక్ బౌలర్ నసీం షా కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. నసీం 14 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ (4), జస్ప్రీత్ బుమ్రా (6), మొహమ్మద్ సిరాజ్ (7) టాప్-10లో ఉన్నారు.
బ్యాటింగ్ విషయానికొస్తే.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బాబర్ 80 పరుగులు చేసి రెండు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో షాహీన్ అఫ్రిది టాప్ ప్లేస్‌కు చేరడంతో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పాక్ ఆటగాళ్లే అగ్రస్థానాలను ఆక్రమించినట్లైంది.
తాజా ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత పాక్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 23వ స్థానానికి చేరాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 11 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి ఎగబాకాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 98 పరుగులు చేసిన బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 44వ స్థానానికి చేరాడు. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో నిలిచారు.
ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మొహమ్మద్ నబీ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. జింబాబ్వే సికందర్ రజా రెండో స్థానంలో, రషీద్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహిది హసన్ మీరాజ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా 14వ స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment