ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ 12వ స్థానానికి పడిపోయాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉండిన బాబర్ మూడు స్థానాలు కోల్పోయి చాలాకాలం తర్వాత టాప్-10 బయటికి వచ్చాడు. ఇదొక్కటి మినహా ఈ వారం టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.
లార్డ్స్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన జో రూట్ గణనీయంగా రేటింగ్ పాయింట్లు పెంచుకుని అగ్రపీఠాన్ని పదిలం చేసుకోగా.. లంకతో రెండో టెస్ట్‌లో పెద్దగా రాణించని హ్యారీ బ్రూక్ ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోయాడు. టీమిండియా బ్యాటింగ్ త్రయం రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి 6, 7, 8 స్థానాలను కాపాడుకోగా.. కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, స్టీవ్ స్మిత్ 2, 3, 4 స్థానాల్లో నిలిచారు.
ఈ వారం టాప్-10 అవతల మార్పుల విషయానికొస్తే.. తాజాగా పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో వీరోచిత శతకం బాదిన బంగ్లా ప్లేయర్ లిటన్ దాస్ ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్థానానికి ఎగబాకగా.. లంక ఆటగాడు కమిందు మెండిస్ 11 స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి చేరాడు. పాక్‌తో రెండో టెస్ట్‌లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసిన మెహిది హసన్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 75వ స్థానానికి చేరగా.. లంకతో టెస్ట్‌లో సెంచరీ చేసిన గస్ అట్కిన్సన్ ఏకంగా 80 స్థానాలు మెరుగుపర్చుకుని 96వ స్థానానికి చేరాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో రాణించిన అశిత ఫెర్నాండో 9 స్థానాలు ఎగబాకి 8వ స్థానానికి చేరుకోగా.. టాప్-10 మిగతా బౌలర్లంతా యధాతథంగా కొనసాగుతున్నారు. అశ్విన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. హాజిల్‌వుడ్, బుమ్రా రెండో స్థానంలో.. కమిన్స్, రబాడ స్థానంలో కొనసాగుతున్నారు.
నాథన్ లయోన్ ఆరు, రవీంద్ర జడేజా ఏడు, కైల్ జేమీసన్ తొమ్మిది, మ్యాట్ హెన్రీ పది స్థానాల్లో నిలిచారు. లార్డ్స్ టెస్ట్‌లో సెంచరీతో పాటు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అట్కిన్సన్ 14 స్థానాలు మెరుగుపర్చుకుని 28వ స్థానానికి ఎగబాకగా.. బంగ్లాతో టెస్ట్‌లో ఆరు వికెట్లు తీసిన ఖుర్రమ్ షెహజాద్ 35 స్థానాలు మెరుగుపర్చుకుని 60వ స్థానానికి చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment