రిజ్వాన్‌ ముఖంపైకి బంతి విసిరిన షకీబ్‌.. ఐసీసీ చర్యలు | Shakib Al Hasan Fined 10 Percent Of His Match Fees For Throwing The Ball Towards Mohammad Rizwan In Frustration | Sakshi
Sakshi News home page

రిజ్వాన్‌ ముఖంపైకి బంతి విసిరిన షకీబ్‌.. ఐసీసీ చర్యలు

Published Tue, Aug 27 2024 7:49 AM | Last Updated on Tue, Aug 27 2024 9:13 AM

Shakib Al Hasan Fined 10 Percent Of His Match Fees For Throwing The Ball Towards Mohammad Rizwan In Frustration

బంగ్లాదేశ్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ మైదానంలో మరోసారి దురుసుగా ప్రవర్తించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌ సందర్భంగా షకీబ్‌.. పాక్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ ముఖంపైకి ఉద్దేశపూర్వకంగా బంతిని విసిరాడు. దీని కారణంగా ఐసీసీ షకీబ్‌ మ్యాచ్‌ ఫీజ్‌లో 10 శాతం కోత విధించింది. అలాగే ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఉల్లంఘన కింద ఓ డీ మెరిట్‌ పాయింట్‌ పొందాడు. 

ఈ ఘటన ఆట చివరి రోజు (ఆదివారం) పాక్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా జరిగింది. షకీబ్‌ బంతి వేయడానికి సిద్దం కాగా.. రిజ్వాన్‌ చివరి నిమిషంలో స్ట్రయిక్‌ నుంచి వెనక్కు తగ్గాడు. దీంతో చిర్రెత్తిపోయిన షకీబ్‌ కోపంగా బంతిని రిజ్వాన్‌వైపు విసిరాడు. ఇది గమనించిన ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బొరో షకీబ్‌ను వెంటనే మందలించాడు. అంతటితో విషయం సద్దుమణిగింది. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి లేదా ఇతరత్రా వస్తువులను ఆటగాళ్లపై కానీ, వారి సమీపంలో కానీ విసిరడం లెవెల్‌ 1 ఉల్లంఘన కింద పరిగణిస్తారు. దీంతో ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఆర్టికల్‌ 2.9 కింద షకీబ్‌కు పెనాల్టీ విధించారు.

కాగా, ఇదే మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోపు కోటా ఓవర్లు పూర్తి చేయనందుకు పాక్‌, బంగ్లాదేశ్‌ జట్లకు ఐసీసీ షాకిచ్చింది. పాక్‌కు ఆరు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్లు, బంగ్లాదేశ్‌కు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పడింది. ఈ పాయింట్ల కోత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలపై ప్రభావం చూపించింది. మూడు పాయింట్లు కోల్పోయినందుకు బంగ్లాదేశ్‌ ఏడో స్థానానికి పడిపోగా.. పాక్‌ పాయింట్లు మరింత తగ్గిపోయి ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.

ఇదిలా ఉంటే, రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 10 వికెట్ల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ  మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ 565 పరుగులు చేసి ఆలౌటైంది.

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్‌ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. వికెట్‌ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్‌ ఆగస్ట్‌ 30న ఇదే వేదికగా జరుగనుంది.

స్కోర్‌ వివరాలు..

పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ 448/6 (సౌద్‌ షకీల్‌ 141, మొహమ్మద్‌ రిజ్వాన్‌ 171 నాటౌట్‌, హసన్‌ మహమూద్‌ 2/70)

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 565 (ముష్ఫికర్‌ అహ్మద్‌ 191, షడ్మాన్‌ ఇస్లాం 93, నసీం షా 3/93)

పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌ 146 (మొహమ్మద్‌ రిజ్వాన్‌ 51, మెహిది హసన్‌ 4/21)

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ 30/0 (జకీర్‌ హసన్‌ 15 నాటౌట్‌)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement