లియోనల్ మెస్సీ.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే పేరు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరినప్పటి నుంచి మెస్సీ జపం మరింత ఎక్కువైంది. ఈసారి ఫైనల్ మ్యాచ్ కేవలం మెస్సీ కోసమే చూస్తున్నవారు కోట్లలో ఉన్నారు. తన ఆటతీరుతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న మెస్సీకి ఇదే చివరి వరల్డ్‌కప్ కానుంది.
అంతేకాదు ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. మెస్సీకి అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ కానుంది. అందుకే అభిమానులు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఫైనల్ చేరిన మరో జట్టు ఫ్రాన్స్ అభిమానుల్లో మెజారిటి మెస్సీ సేన వరల్డ్‌కప్ గెలవాలని బలంగా కోరుకుంటుండడం విశేషం. మరి మెస్సీ అందరి అంచనాలను అందుకొని అర్జెంటీనాకు కప్ అందించి తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మరోవైపు ఫ్రాన్స్ కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బలంగా కనిపిస్తుంది. కైలియన్ ఎంబాపె ఆ జట్టుకు పెద్ద బలం. వరుసగా రెండో ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గి బ్రెజిల్, ఇటలీ సరసన నిలవాలని ఫ్రాన్స్ భావిస్తోంది.
ఇదిలా ఉంటే టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న మెస్సీని ఆరు రికార్డులు ఊరిస్తున్నాయి. తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్న మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఐదు గోల్స్ చేశాడు. ప్రీ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ మెస్సీకి 1000వ మ్యాచ్. తాజాఆ ఫైనల్ మ్యాచ్ ఆడితే ఒక రికార్డు.. గోల్ కొడితే మరొక రికార్డు.. ఇలా అన్ని రికార్డులు ఒక్క మ్యాచ్‌తోనే ముడిపడి ఉన్నాయి. మరి మెస్సీని ఊరిస్తున్న ఆ ఆరు రికార్డులు ఏంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
వరల్డ్‌కప్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా..
ఫిఫా వరల్డ్‌కప్స్‌లో మెస్సీ ఒక ఆటగాడిగా ఇప్పటివరకు 16 విజయాలు అందుకున్నాడు. ఒకవేళ ఫైనల్‌లో అర్జెంటీనా నెగ్గితే మెస్సీ ఖాతాలో 17వ విజయం అవుతుంది. ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్న ఆటగాడిగా మెస్సీ.. జర్మనీ లెజెండరీ ప్లేయర్ మిరాస్లోవ్ క్లోస్ సరసన నిలవనున్నాడు. మిరాస్లోవ్ క్లోస్ తన కెరీర్‌లో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 17 విజయాలు అందుకున్నాడు.
అత్యధిక మ్యాచ్‌ల్లో పాల్గొన్న ఆటగాడిగా..
ఫ్రాన్స్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్ మెస్సీకి ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 26వ మ్యాచ్ కానుంది. ఈ నేపథ్యంలో జర్మనీ ఆటగాడు లోథర్ మాథ్యూస్ రికార్డును మెస్సీ బద్దలు కొట్టనున్నాడు. లోథర్ మాథ్యూస్ ఫిఫా వరల్డ్‌కప్స్‌లో జర్మనీ తరపున 25 మ్యాచ్‌లు ఆడాడు. తాజాగా ఫ్రాన్స్‌తో ఫైనల్ మ్యాచ్ ద్వారా మెస్సీ.. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నాడు.
వరల్డ్‌కప్‌లో అత్యధిక నిమిషాలు ఆడిన ఆటగాడిగా..
ఫిఫా వరల్డ్‌కప్స్ చరిత్రలో అత్యధిక నిమిషాలు మ్యాచ్‌లో గడిపిన ఆటగాడిగా ఇటలీ దిగ్గజం పాలో మల్దినీ తొలి స్థానంలో ఉన్నాడు. పాలో మల్దిని 2217 నిమిషాల పాటు మైదానంలో గడిపాడు. ఇక మెస్సీ ఇప్పటివరకు 2197 నిమిషాలతో రెండో స్థానంలో ఉన్నాడు మెస్సీకి, పాలో మల్దినీకి మధ్య వ్యత్యాసం కేవలం 23 నిమిషాలు మాత్రమే ఉంది. తాజాగా ఫ్రాన్స్‌తో జరగనున్న ఫైనల్లో మెస్సీ ఈ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది.
అత్యధిక అసిస్ట్‌లు చేసిన ఆటగాడిగా..
మెస్సీ ఇప్పటివరకు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో తొమ్మిది అసిస్ట్‌లు చేశాడు. ప్రస్తుతం బ్రెజిల్ దిగ్గజం పీలే పది అసిస్ట్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఒకవేళ ఫ్రాన్స్‌తో ఫైనల్లో మెస్సీ ఇతర ఆటగాళ్లు గోల్స్ చేయడంలో రెండు అసిస్ట్ ఇవ్వగలిగితే పీలే రికార్డు బ్రేక్ చేసి తాను మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉంది.
మల్టిపుల్ గోల్డెన్ బాల్ అవార్డ్స్..
2014 ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ తొలిసారి గోల్డెన్ బాల్ అవార్డు గెలుచుకున్నాడు. ఒక వరల్డ్‌కప్‌లో బెస్ట్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఆటగాడికి గోల్డెన్ బాల్ అవార్డు అందిస్తారు. ఈసారి వరల్డ్‌కప్‌లోనూ మెస్సీ సూపర్ ఫామ్‌లో ఉండడం అతనికి గోల్డెన్ బాల్ దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మెస్సీ గోల్డెన్ బాల్ గెలుచుకుంటే.. ఫిఫా టోర్నీ చరిత్రలో రెండుసార్లు గోల్డెన్ బాల్ గెలుచుకున్న తొలి ప్లేయర్‌గా మెస్సీ చరిత్ర సృష్టించనున్నాడు. అయితే ఈ అవార్డు కోసం మెస్సీతో ఫ్రాన్స్ సూపర్‌స్టార్ ఎంబాపె పోటీలో ఉన్నాడు.
ఏకకాలంలో గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్ అందుకునే అవకాశం..
ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక గోల్ చేసిన ఆటగాడికి ఇచ్చే అవార్డు గోల్డెన్ బూట్. ఈసారి ఈ అవార్డుకు మెస్సీతో పాటు ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె కూడా పోటీ పడుతున్నాడు. ఇద్దరు చెరో ఐదు గోల్స్‌తో ఉన్నారు. ఇక ఫైనల్లో వీరిద్దరిలో ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వారికే గోల్డెన్ బూట్ దక్కుతుంది. ఇక ఏకకాలంలో గోల్డెన్ బూట్‌తో పాటు గోల్డెన్ బాల్ అవార్డు దక్కించుకునే అవకాశం మెస్సీతో పాటు ఎంబాపెకు ఉంది. మెస్సీ లేదా ఎంబాపెలలో ఎవరు దక్కించుకున్నా ఫిఫా చరిత్రలో ఎనిమిదో ఆటగాడిగా చరిత్రకెక్కనున్నారు. ఇంతకముందు లియోనిదాస్ సిల్వా(1938), గారించా(1962), రొనాల్డో(1998), పాలో రోసి(1982), సాల్వటోర్ సిలాచి(1990), మారియో కెంప్(1978) ఏకకాలంలో గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్ అవార్డును కొల్లగొట్టారు.
అత్యధిక గోల్స్ కాంట్రిబ్యూషన్స్..
మెస్సీ ఇంతవరకు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 20 గోల్స్ కాంట్రిబ్యూషన్‌లో పాల్గొన్నాడు. ఇందులో పదకొండు గోల్స్‌తో పాటు తొమ్మిది అసిస్ట్‌లు ఉన్నాయి. బ్రెజిల్ దిగ్గజం పీలే 22 గోల్స్ కాంట్రిబ్యూషన్‌తో(12 గోల్స్, 10 అసిస్ట్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇవాళ ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్ ద్వారా మెస్సీ.. పీలే రికార్డును సమం చేయడమో లేక బద్దలు కొట్టే అవకాశం ఉంది.
చదవండి: FIFA WC Final: ప్రైజ్‌మనీ.. విన్నర్‌కు ఎంత ; రన్నరప్‌కు ఎంత?
Comments
Please login to add a commentAdd a comment