క్రికెట్ చరిత్రలో మరో అద్భుతమైన క్యాచ్ నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 2) మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక వికెట్‌కీపర్ సదీర సమరవిక్రమ నమ్మశక్యంకాని రీతిలో క్రేజీ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసిన వాళ్లు 'కలయా నిజమా..' అని అంటున్నారు. సమరవిక్రమ ముందుచూపుకు హ్యాట్సాఫ్ అంటున్నారు.
ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ఆఫ్ఘన్ ఆటగాడు రెహ్మత్ షా లెగ్‌సైడ్ స్వీప్ షాట్ ఆడాడు. సాధారణంగా అయితే ఈ షాట్ వికెట్‌కీపర్‌కు చాలా దూరంగా (లెగ్ స్లిప్ అనవచ్చు) వెళ్తూ బౌండరీకి చేరుకుంటుంది. అయితే షా ఈ షాట్ ఆడతాడని ముందుగానే పసిగట్టిన సమరవిక్రమ బంతి పిచ్ కాగానే లెగ్‌సైడ్ దిశగా వెళ్లి తక్కువ ఎత్తులో గాల్లోకి లేచిన బంతిని ఇట్టే పట్టేసుకున్నాడు. బ్యాటర్, బౌలర్ సహా ఈ తంతు మొత్తం చూస్తున్న వారు నివ్వెరపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది.
Crazy catch 😳pic.twitter.com/wQgNRGtSsO
— CricTracker (@Cricketracker) February 2, 2024
కాగా, స్వదేశంలో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. అషిత ఫెర్నాండో (14.4-1-24-3), విశ్వ ఫెర్నాండో (12-1-51-4), ప్రభాత్ జయసూర్య (25-7-67-3) విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక.. రెండో బంతికే ఆఫ్ఘన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌ను (0) పెవిలియన్‌కు పంపింది. ఆతర్వాత వన్‌డౌన్ ఆటగాడు రెహ్మత్ షా (91).. మరో ఓపెనర్, అరంగేట్రం ఆటగాడు నూర్ అలీ జద్రాన్‌తో (31) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
సమరవిక్రమ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ అయిన రెహ్మత్ షాను పెవిలియన్‌కు పంపిన అనంతరం ఆఫ్ఘన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది 17, నసీర్ జమాల్ 0, ఇక్రమ్ అలికిల్ 21, కైస్ అహ్మద్ 21, జియా ఉర్ రెహ్మాన్ 4, నిజత్ మసూద్ 12, మొహమ్మద్ సలీం 0 పరుగులకు ఔటయ్యారు. 44 పరుగుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌తో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు (నూర్ అలీ జద్రాన్, నవీద్ జద్రాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, మొహమ్మద్ సలీం) టెస్ట్ అరంగేట్రం చేయడం విశేషం.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. నిషాన్ మధుష్క (36), దిముత్ కరుణరత్నే (42) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment