Sourav Ganguly-Dona Love Story: Childhood Lovers To Secret Wedding - Sakshi
Sakshi News home page

Sourav Ganguly: సినిమాను తలపించే ట్విస్టులు.. కుటుంబాల మధ్య గొడవ.. సీక్రెట్‌గా ప్రేమా, పెళ్లి! ఆఖరికి..

Published Sat, Jul 8 2023 10:01 AM | Last Updated on Sat, Jul 8 2023 10:18 AM

Sourav Ganguly Dona Love Story Childhood Lovers To Secret Wedding - Sakshi

Sourav Ganguly Dona Roy Love Story: టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్‌ గంగూలీ శనివారం 51వ వసంతంలో అడుగుపెట్టాడు. వివాదాలను లెక్క చేయకుండా భారత క్రికెట్‌లో సంచలన మార్పులకు కారణమైన దాదా వ్యక్తిగత జీవితం గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఈరోజు గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా డోనా రాయ్‌తో అతడి ప్రేమ, పెళ్లి గురించిన ఆసక్తికర విషయాలు మీకోసం..

చిన్ననాటి నుంచే పరిచయం
గంగూలీ చిన్నపుడు ఎక్కువగా ఫుట్‌బాల్‌ ఆడేవాడు. స్నేహితులతో కలిసి గ్రౌండ్‌కు వెళ్లే దారిలోనే డోనా ఇల్లు ఉండేది. అలా ఓసారి ఆమెను చూసిన దాదా.. తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. 

అప్పుడప్పుడు బ్యాడ్మింటన్‌ కూడా ఆడే గంగూలీ కావాలనే రెండు మూడుసార్లు షటిల్‌కాక్‌ను డోనా ఇంట్లో పడేశాడు. అలా తమకు సంబంధించిన వస్తువును తిరిగి తెచ్చుకునే సాకుతో డోనాతో మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి స్నేహంగా మారింది. అప్పటి నుంచి గంగూలీ- డోనా డేటింగ్‌ చేయడం మొదలుపెట్టారు.

రెస్టారెంట్‌లో తొలిసారి
అలా ప్రేమ పక్షులు తొలిసారి కోల్‌కతాలోని ఓ చైనీస్‌ రెస్టారెంట్‌లో కలుసుకున్నారు. నచ్చినవన్నీ ఆర్డర్‌ చేసి ఫుల్లుగా లాగించేశారు. ఆ తర్వాత నుంచి అక్కడే తరచుగా కలుసుకునేవారు డోనా- గంగూలీ. స్నేహం పెరిగి ప్రేమగా మారింది.

కుటుంబాల మధ్య గొడవ
సౌరవ్‌ గంగూలీ- డోనా రాయ్‌ కుటుంబాల మధ్య ముందు నుంచే గొడవలు ఉన్నాయి. దీంతో ఇరు కుటుంబాలు ఉప్పు-నిప్పుగా ఉండేవి. అయితే, ఇవేమీ ఈ లవ్‌బర్డ్స్‌పై ప్రభావం చూపలేదు. ఇద్దరి మనసులు కలవడంతో జీవితాంతం కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు.

కానీ.. అప్పటికి జీవితంలో సెటిల్ కాలేదు కాబట్టి తమ రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గానే ఉంచారు. అప్పటికే టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన గంగూలీ.. 1996లో టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు.

ఇంట్లో చెప్పకుండా పెళ్లి
ప్రఖ్యాత లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన గంగూలీ.. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత డోనాను వివాహమాడాలని ప్లాన్‌ చేసుకున్నాడు. స్నేహితుడి నివాసంలో రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. అంతా సజావుగానే సాగింది.

ఒకరి చేయి ఒకరు వీడలేదు
అయితే, తమ పెళ్లి విషయాన్ని చాలా కాలం వరకు సీక్రెట్‌గానే ఉంచిన గంగూలీ- డోనా.. ఒకానొక రోజు నిజం బయటపడటంతో ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కానీ.. ఒకరి చేయి ఒకరు వీడలేదు. తమ నిజమైన ప్రేమతో పెద్దల మనసు గెలిచి కథను సుఖాంతం చేసుకున్నారు.

ఇక 1997లో పెళ్లి చేసుకున్న డోనా- సౌరవ్‌ గంగూలీ జంటకు 2001లో కూతురు జన్మించింది. ఆమెకు సనాగా నామకరణం చేశారు. ఇక టీమిండియా స్టార్‌గా గంగూలీ, ఒడిస్సీ డ్యాన్సర్‌గా డోనా తమ కెరీర్‌లో విజయవంతమైన విషయం తెలిసిందే. వైవాహిక జీవితంలోనూ ఒడిదొడుకులు ఎదురైనా వాటిని అధిగమించి ఒక్కటిగా కొనసాగుతున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: టీమిండియాతో సిరీస్‌కు జట్టును ప్రకటించిన విండీస్‌.. ఆ ఇద్దరు తొలిసారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement