photo credit: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో మూకుమ్మడిగా రాణించి, 2 వరుస పరాజయాల తర్వాత హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. కెమారూన్ గ్రీన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (64 నాటౌట్, 1/29) చెలరేగగా.. తిలక్ వర్మ (37), ఇషాన్ కిషన్ (38) బ్యాటింగ్‌లో.. మెరిడిత్ (2/33), బెహ్రెన్‌డార్ఫ్ (2/37) బౌలింగ్‌లో రాణించారు.
మ్యాచ్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన అర్జున్ టెండూల్కర్, 20 పరుగుల టార్గెట్‌ను డిఫెండ్ చేసుకుని, తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి వికెట్‌ను సాధించాడు. ఈ క్రమంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్‌పై, ఐపీఎల్ కెరీర్‌లో తొలి వికెట్ (భువనేశ్వర్) సాధించిన అర్జున్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అభిమానులు, సహచర ఆటగాళ్ల దగ్గరి నుంచి సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగ దిగ్గజాల వరకు అందరూ పోటీపడుతూ ముంబై ఇండియన్స్‌ను ముఖ్యంగా సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సాధించిన ఘనతను వేనోళ్ల కీర్తిస్తున్నారు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అర్జున్ చివరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేశాడని, అతను బౌల్ చేసిన ఐదు బంతులు అద్భుతమైన యార్కర్ లెంగ్త్ బంతులని కొనియాడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ఫస్ట్ స్పెల్‌లోనూ అర్జున్ పొదుపుగా బౌలింగ్ చేశాడని, అరంగేట్రం మ్యాచ్‌లోనూ అతను మెరుగ్గానే బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ దక్కలేదని అంటున్నారు. అర్జున్‌పై ప్రశంసలతో ఆగని సెలబ్రిటీలు.. క్రికెట్ దేవుడు, అర్జున్ తండ్రి సచిన్‌ను కూడా ఆకాశానికెత్తుతున్నారు. తండ్రి పెంపకం వల్లే అర్జున్ కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడని కొనియాడుతున్నారు.
సచిన్.. నెపొటిజమ్ అనే మాటకు ఛాన్స్ ఇవ్వకుండా, తన కొడుకు కష్టపడి సొంతంగా ఎదిగేలా చేశాడని కీర్తిస్తున్నారు. సచిన్ కొడుకు హోదాలో అర్జున్ ఎప్పుడో అంతర్జాతీయ క్రికెట్ కూడా ఆడి ఉండేవాడని, అలాంటిది ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకే అర్జున్ దాదాపు మూడేళ్లు నిరీక్షించాల్సి వచ్చిందని సచిన్ సమకాలీకులు, అతని సీనియర్లు అంటున్నారు. మున్ముందు అర్జున్ ఫ్రాంచైజీ క్రికెట్‌తో పాటు టీమిండియా తరఫున కూడా అద్భుతాలు చేస్తాడని మెజారిటీ జనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అర్జున్ సాధించిందేమిటి.. సచిన్ కొడుకు కాకపోయి ఉంటే..
మరోవైపు అర్జున్‌పై పొగడ్తల వర్షాన్ని జీర్ణించుకోలేని వారు, అర్జున్ కష్టాన్ని చులకన చేసే వాళ్లు కూడా లేకపోలేదు. అర్జున్ కష్టాన్ని, భారత క్రికెట్‌కు సచిన్ చేసిన సేవలను లెక్క చేయకుండా కొందరు అర్జున్‌ను అతని తండ్రిని విమర్శిస్తున్నారు. అర్జున్ ఏం సాధించాడని ఇంతలా హైలైట్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఏమీ లేకపోయినా భజన చేయడం కొందరికి అలవాటుగా మారిందని అంటున్నారు.
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అర్జున్‌ది అతి సాధారణ ప్రదర్శన అని, సచిన్ కొడుకు కాకపోయి ఉంటే సెలబ్రిటీలు ఇంతలా సోషల్‌మీడియాను హోరెత్తించేవారా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అర్జున్ బౌలింగ్‌లో చాలా లోపాలు ఉన్నాయని, ఎవరైతే అర్జున్‌ను పొగుతున్నారో వారికి నిజంగా సచిన్‌పై అభిమానముంటే, వాటిని వేలెత్తి చూపి సరి చేసుకునేలా చేయాలని కోరుతున్నారు. ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్ల కొట్టి, అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రింకూ సింగ్ లాంటి వాళ్లకు ఇలాంటి ప్రశంసలే దక్కితే ఊహకందని ఎన్నో అద్భుతాలు చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా అర్జున్‌పై ప్రశంసలతో, విమర్శలతో సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment