వన్డే క్రికెట్‌ చరిత్రలో శ్రీలంక అత్యంత చెత్త రికార్డు | Sri Lanka Create Worst Record For Most Losses In ODI Cricket | Sakshi
Sakshi News home page

వన్డే క్రికెట్‌ చరిత్రలో శ్రీలంక అత్యంత చెత్త రికార్డు

Published Fri, Jul 2 2021 5:50 PM | Last Updated on Sat, Jul 3 2021 8:29 AM

Sri Lanka Create Worst Record For Most Losses In ODI Cricket - Sakshi

లండన్‌: వన్డే క్రికెట్‌ చరిత్రలో శ్రీలంక అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. వన్డేల్లో ఎ‍క్కువ మ్యాచ్‌ల్లో ఓడిన జట్టుగా లంక తొలిస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఓడిన లంక జట్టు 428వ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓవరాల్‌గా ఇప్పటివరకు 858 వన్డే మ్యాచ్‌లాడిన శ్రీలంక 390 విజయాలు, 428 పరాజయాలు చవిచూసింది. అయితే వన్డేల్లో అధిక ఓటములు చవిచూసిన రెండో జట్టుగా టీమిండియా(427) ఉండడం విశేషం.

కాగా టీమిండియా మ్యాచ్‌ల సంఖ్య పరంగా చూస్తే మాత్రం లంకకు చాలా దూరంలో ఉంది. టీమిండియా మొత్తంగా 993 వన్డే మ్యాచ్‌లాడింది. లంకతో పోలిస్తే 137 మ్యాచ్‌లు అధికంగా ఉన్నాయి. ఇక విజయాల శాతం పరంగా చూస్తే భారత్‌ 54.67 శాతంతో ఉండగా.. శ్రీలంక 47.69 శాతంతో ఉంది. ఇక 414 ఓటములతో పాకిస్తాన్‌ మూడో స్థానంలో కొనసాగుతుంది. మరో విశేషమేమిటంటే.. టీ20ల్లో అత్యధిక ఓటములు కలిగిన జట్టుగా శ్రీలంక(70) తొలి స్థానంలో ఉంది. వెస్టిండీస్‌ 67, పాకిస్తాన్‌ 65 ఓటములతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

కాగా కుమార సంగక్కర, జయవర్దనే లాంటి స్టార్‌ ఆటగాళ్లు జట్టుకు దూరమైన తర్వాత శ్రీలంక ఆటతీరు నానాటికి తీసికట్టుగా తయారవుతుంది. ఈ మధ్యకాలంలో ఆడిన ప్రతీ సిరీస్‌లోనూ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న లంక జట్టు వరుస ఓటములను చవిచూసింది. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ఆడుతున్న లంక స్వదేశంలో టీమిండియాను ఎదుర్కొనబోతుంది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు టీమిండియా రెండో జట్టును ఓడించి సిరీస్‌లను కైవసం చేసుకుంటుందో లేదో చూడాలి. కాగా ఇండియా, శ్రీలంకల మధ్య తొలి వన్డే జూలై 13న జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement