గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ టోర్నీలో సర్రే జాగ్వర్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న స్టోయినిస్.. టోరంటో నేషనల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో ఆతర్వాత బంతితో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాగ్వర్స్.. స్టోయినిస్ హాఫ్ సెంచరీతో (37 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
జాగ్వర్స్ ఇన్నింగ్స్‌లో కైల్ మేయర్స్ (27), విరన్‌దీప్ సింగ్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సునీల్ నరైన్ (2), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (18), శ్రేయస్ మొవ్వ (4), మొహమ్మద్ నబీ (13) నిరాశపరిచారు. టోరంటో బౌలర్లలో రోహిద్ ఖాన్, జునైద్ సిద్దిఖీ తలో రెండు వికెట్లు, రొమారియో షెపర్డ్, జతిందర్‌పాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టోరంటో.. స్టోయినిస్ (4-1-19-3), సునీల్ నరైన్ (3-0-3-3), మొహమ్మద్ నబీ (2-0-6-2), బెన్ లిస్టర్ (3-0-14-1), హర్మీత్ సింగ్ (2.1-0-18-1) దెబ్బకు 17.1 ఓవర్లలో 81 పరుగులకు ఆలౌటైంది. టోరంటో ఇన్నింగ్స్‌లో ఉన్ముక్త్ చంద్ (21), డస్సెన్ (15), కిర్టన్ (11), రోహిత్ పౌడెల్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. భారీ హిట్టర్లు రోస్టన్ ఛేజ్ (8), కొలిన్ మున్రో (4), రొమారియో షెపర్డ్ దారుణంగా విఫలమయ్యారు.
కాగా, గ్లోబల్ టీ20 కెనడా అనే టోర్నీ కెనడా వేదికగా జరిగే క్రికెట్ లీగ్. ఈ లీగ్‌లోనూ మిగతా లీగ్‌లలో లాగే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెటర్లు పాల్గొంటారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు (మాంట్రియాల్ టైగర్స్, టోరంటో నేషనల్స్, సర్రే జాగ్వర్స్, బ్రాంప్టన్ వోల్వ్స్, బంగ్లా టైగర్స్, వాంకోవర్ నైట్స్) పాల్గొంటాయి. లీగ్ మ్యాచ్‌ల అనంతరం తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. ప్రస్తుత సీజన్ ఈనెల 25న మొదలైంది.
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో మాంట్రియల్ టైగర్స్ టాప్‌లో ఉంది. ఈ లీగ్‌లో డేవిడ్ వార్నర్, మార్కస్ స్టోయినిస్, సునీల్ నరైన్, కార్లోస్ బ్రాత్‌వైట్, మొహమ్మద్ ఆమిర్, మొహమ్మద్ నబీ, కైల్ మేయర్స్, క్రిస్ లిన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, టిమ్ సీఫర్ట్, నవీన్ ఉల్ హక్, షకీబ్ అల్ హసన్, రహ్మానుల్లా గుర్బాజ్, డస్సెన్, కొలిన్ మున్రో, రొమారియో షెపర్డ్ లాంటి టీ20 స్టార్లు పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment