
త్వరలో విండీస్‌తో స్వదేశంలో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 3 వన్డేలు, 3 టీ20ల ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన టీమిండియా పర్ఫెక్ట్‌గా ఉందని కొందరంటుంటే, రిషి ధవన్, షారుఖ్ ఖాన్, దేవ్‌దత్ పడిక్కల్ లాంటి అర్హులైన క్రికెటర్లకు అన్యాయం జరిగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో గతంలో సత్తా చాటి గాయాల కారణంగా కనుమరుగైన ఓ యువ క్రికెటర్ పేరు తెరపైకి వచ్చింది. అతనే తంగరసు నటరాజన్. ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అనామక బౌలర్‌గా బరిలోకి దిగి యార్కర్లతో గడగడలాడించిన అతను.. ఆ తర్వాత టీమిండియా తరఫున కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడి జట్టుకు దూరమయ్యాడు. తాజాగా విండీస్‌తో సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో అతని పేరు లేకపోవడంతో నట్టూకు ఏమైనట్టు.. అతను ఎక్కడున్నాడు..? అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
బీసీసీఐ అందించిన సమాచారం మేరకు.. టీమిండియాలో ఫాస్ట్ బౌలింగ్ స్లాట్ కోసం తీవ్ర పోటీ నెలకొందని, నట్టూ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీ టోర్నీల్లో రాణించి సత్తా చాటాల్సి ఉంటుంది. 2021 ఐపీఎల్‌కి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా గాయపడ్డ నట్టూ.. ఐపీఎల్ ఫస్టాఫ్‌కు దూరమయ్యాడు. అనంతరం దుబాయ్‌లో జరిగిన సెకండాఫ్ సమయానికి కోలుకున్నప్పటికీ.. కరోనా బారిన పడడంతో లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం దేశవాళీ టోర్నీల్లో పాల్గొన్నా ఇంతకుముందులా మెరవకపోవడంతో అతనికి టీమిండియా నుంచి పిలుపు రాలేదు.
కాగా, తమిళనాడుకు చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నటరాజన్.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు యార్కర్లు వేసి.. క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అనంతరం ఆస్ట్రేలియా టూర్‌కి లక్కీగా(వరుణ్ చక్రవర్తి గాయపడడంతో) ఎంపికైన అతను.. టీ20 సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసి టీమిండియాకి సిరీస్ విజయాన్ని అందించాడు. ఈ సిరీస్‌లో నట్టూ.. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. అనంతరం జరిగిన టెస్ట్ సిరీస్‌లో కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో గబ్బాలో టెస్ట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కెరీర్‌లో ఓ టెస్ట్, 2 వన్డేలు, 4 టీ20 ఆడిన నటరాజన్.. మొత్తం 13 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లో 24 మ్యాచ్‌ల్లో 20 వికెట్లతో సత్తా చాటాడు.
చదవండి: ఐపీఎల్ ఆడకపోవడమే అతను చేసిన నేరమా.. అందుకే టీమిండియాకు ఎంపిక చేయలేదా..?
Comments
Please login to add a commentAdd a comment