టీమిండియాలోకి ఎంత ‘వేగం’గా దూసుకువచ్చాడో.. అంతే త్వరగా జట్టుకు దూరమయ్యాడు కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్.. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు.
అత్యంత వేగంగా బంతులు విసురుతూ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్.. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు.
అనంతరం వన్డేల్లోనూ అడుగుపెట్టాడు ఈ స్పీడ్‌గన్. అయితే, నిలకడలేమి ప్రదర్శన కారణంగా మేనేజ్‌మెంట్ నమ్మకం పోగొట్టుకున్న ఉమ్రాన్ మాలిక్.. ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. చివరగా గతేడాది వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో ఆడాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే ఉమ్రాన్ మాలిక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు కెప్టెన్ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని.. అందుకే జట్టుకు దూరమైపోయాడని పేర్కొన్నాడు.
కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు
‘‘మనలోని ప్రతిభకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవాలి. ఓ బౌలర్ ఎక్స్‌ప్రెస్ పేస్ కలిగి ఉండటం అరుదైన అంశం. అతడి శక్తిసామర్థ్యాలకు నిదర్శనం.
అతడు గంటకు 145- 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసినపుడు.. అంతకంటే వేగంగా బంతులు విసరగలడని భావించాం. కానీ అలా జరుగలేదు.
కానీ తన బౌలింగ్‌లోని పేస్ మాత్రమే తన బలం. అంతేగానీ బౌల్ చేసేటపుడు లైన్ అండ్ లెంగ్త్ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా టీ20లలో పూర్తి కంట్రోల్ ఉండాలి.
అందులో విఫలమైతే కచ్చితంగా కష్టాలు మొదలవుతాయి. బ్యాటర్ బాల్‌ను బాదుతూ ఉంటే.. చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం. అలాంటపుడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోవడం ఖాయం.
రంజీలు ఆడమని పంపించాం
అతడికి బౌలింగ్‌పై పూర్తి నియంత్రణ రావాలనే ఉద్దేశంతోనే రంజీలు ఆడమని పంపించాం. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ కచ్చితంగా నైపుణ్యాలు ప్రదర్శించగలగాలి’’ అని పారస్ మాంబ్రే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించాడు.
కాగా ఉమ్రాన్ మాలిక్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఎనిమిది టీ20లు, పది వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment